టీకా ఎప్పుడు వస్తుంది, కొవిడ్ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో నిపుణుల బృందం భేటీ

  • Published By: naveen ,Published On : August 18, 2020 / 09:09 AM IST
టీకా ఎప్పుడు వస్తుంది, కొవిడ్ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో నిపుణుల బృందం భేటీ

Updated On : August 18, 2020 / 11:48 AM IST

దేశీయంగా కొవిడ్‌-19 టీకా అభివృద్ధి చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులతో నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకేపాల్‌ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల బృందం సోమవారం(ఆగస్టు 17,2020) సమావేశమైంది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ, పుణెకి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, జెనోవా ఫార్మాస్యూటికల్స్‌, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ కేడిలా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా కంపెనీలు తయారుచేస్తున్న వ్యాక్సిన్‌లు ప్రస్తుతం ఏయే దశల్లో ఉన్నది నిపుణుల బృందం ఈ సమావేశంలో అడిగి తెలుసుకుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఆ సంస్థలు ఆశిస్తున్న అంశాల గురించి కూడా ఆరా తీసింది.



తొలి రెండు ద‌శ‌ల్లోనే ఇండియా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్:
మ‌న‌ దేశంలో క‌రోనా వ్యాక్సిన్ పై విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ప‌రిశోధ‌న‌లు చేస్తున్న మూడు కంపెనీలు తొలి, రెండు ద‌శ‌ల్లోనే హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ను కొన‌సాగిస్తున్న‌ట్లు తేలింది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలాలు మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్ ను పూర్తి చేసి రెండో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ను ప్రారంభించ‌నున్నాయి.



టీకా కోసం కోటి ఆశలతో ఎదురుచూపులు:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కోసం అంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే రష్యా కొవిడ్ టీకాపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక భారత్‌లో కూడా సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ రెడీ చేసే పనిలో ఉన్నారు. భారత్ బయోటెక్ కంపెనీ కోవాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే తొలిసారిగా కరోనా వారియర్స్‌కే దాన్ని అందిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు.