కేంద్రం గుడ్ న్యూస్ : సామాన్యులకు కరోనా వ్యాక్సిన్, ఎప్పటి నుంచి

కేంద్రం గుడ్ న్యూస్ : సామాన్యులకు కరోనా వ్యాక్సిన్, ఎప్పటి నుంచి

Covid Vaccines

Updated On : February 24, 2021 / 7:09 PM IST

Covid Vaccines : కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే ఇస్తున్న వ్యాక్సిన్ ను ఇకపై సామాన్యులకు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి వ్యాక్సిన్ ను అందివ్వాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్ టీకా డ్రైవ్ రెండో దశ మార్చి 1 నుండి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ టీకాలు దేశ వ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేట్ కేంద్రాల్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ టీకాలు ప్రభుత్వ ఆధీనంలో ఉచితంగా లభిస్తాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రయివేటు ఆసుపత్రులతో టీకా ఫీజు ఎంతన్నది ఆరోగ్యశాఖ రెండు మూడు రోజులలో నిర్ణయిస్తుందన్నారు.

కరోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మొదటి దశలో టీకా అందించిన కేంద్రం.. ఆ తర్వాత పోలీసులు, పారుశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు కూడా టీకా అందిస్తోంది. ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 10వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. మరో 20వేల ప్రైవేటు కేంద్రాల ద్వారా కూడా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ వెల్లడించారు. రెండో దశలో 27 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సీన్‌ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

దేశవ్యాప్తంగా జనవరి 16న కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకూ కోటి 21లక్షల 65వేల 598 మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో కోటి 7లక్షల 67వేల 198 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి డోసు ఇచ్చినట్లు తెలిపింది. అలాగే 13లక్షల 98వేల 400 మందికి రెండో డోసు అందించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు అందిస్తున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.