Cyclone Biparjoy : ముంచుకొస్తున్న ముప్పు.. భయపెడుతున్న అతి భయంకరమైన తుఫాన్ బిపర్‌జోయ్, ఆందోళనలో అన్నదాతలు
Cyclone Biparjoy : బిపర్ జోయ్ వల్ల మరో 4 వారాల పాటు పొడి వాతావరణమే కొనసాగవచ్చని చెబుతున్నారు.

Cyclone Biparjoy
Cyclone Biparjoy : అరేబియా సముద్రంలో ఏర్పడిన అతి భయంకర తుఫాన్ బిపర్ జోయ్ హడలెత్తిస్తోంది. గురువారం గుజరాత్ లోని కచ్ వద్ద తీరం తాకనున్న ఈ తుఫాన్ దేశంలో రుతుపవనాల కదలికలపై ప్రభావం చూపనుందనే హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఖరీఫ్ సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు.
ఇప్పుడు తుపాన్ వల్ల రుతుపవనాల కదలిక కూడా మందగించే అవకాశం ఉందనే హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట సీజన్ ఆలస్యమైతే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైన తీవ్రమైన ఎఫెక్ట్ చూపుతుంది. అయితే, ఈ సీజన్ లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నప్పటికీ మరో 4 వారాల పాటు రుతుపవన వర్షాలకు చాన్స్ లేదనే సమాచారం ఆందోళన రేకేత్తిస్తోంది.
జూన్ 9 నుంచి జూలై 6వ తేదీ మధ్య 4 వారాల పాటు బిపర్ జోయ్ ఎఫెక్ట్ ఉంటుందని స్కైమెట్ అంచనా వేసింది. జూన్ 1న కేరళలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు.. తుపాను కారణంగా వారం రోజులు ఆలస్యమయ్యాయి. 6, 7 తేదీల మధ్య కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. తరువాత కర్నాటక, ఏపీలోని రాయలసీమలో నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. తుపాను వల్ల రుతుపవనాల కదలికలో వేగంగా బాగా తగ్గడంతో వర్షం కురిసే అవకాశం లేదని చెబుతోంది స్కైమెట్. అంతేకాదు వేసవి పొడి గాలులు, రుతుపవన మేఘాల మధ్య సంఘర్షణ జరుగుతోందని, తుఫాన్ గాలుల వల్ల మేఘాలు తరలిపోయే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల వల్ల తెలంగాణతో సహా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ లోని మాన్ సూన్ జోన్ లో రుతుపవనాల వర్షాలు చాలా అవసరం అని పేర్కొంది. కానీ, బిపర్ జోయ్ వల్ల మరో 4 వారాల పాటు పొడి వాతావరణమే కొనసాగవచ్చని చెబుతున్నారు. రాబోయే 4 వారాల్లో నైరుతి తెలంగాణలో కొంత ప్రాంతం మినహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మధ్య తెలంగాణలోని కొన్ని జిల్లాలు కూడా తీవ్రమైన పొడి పరిస్థితులను ఎదుర్కొంటాయని తన నివేదికలో తెలియజేసింది స్కైమెట్.