Cylone Mandous: తుపాను ఎఫెక్ట్.. చెన్నైలో పెరిగిన రవాణా ఛార్జీలు, తగ్గిన కూరగాయల ధరలు
మాండౌస్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో వర్షాల కారణంగా రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు తగ్గాయి.

Cylone Mandous: ‘మాండౌస్’ తుపాన్ ప్రభావం తమిళనాడు, ఆంధప్రదేశ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తమిళనాడులోని చెన్నై ప్రాంతంలో మాత్రం తుపాను ప్రభావం అనేక రంగాలపై పడింది.
కూరగాయల ధరలు తగ్గుతుండగా, రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. ఇక్కడ మూడు రోజులగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రవాణా స్తంభించింది. రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణంగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆటో, క్యాబ్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో కంటే రూ.100-150 వరకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. దీనికి క్యాబ్, ఆటో డ్రైవర్లు తమ కారణాలు చెబుతున్నారు. వర్షపు నీటిలో వాహనాల్ని నడపడం కష్టమని, పైగా ఇంజిన్‌లోకి నీళ్లు చేరితే వాహనాలు పాడయ్యే అవకాశం ఉందని, అందువల్లే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నామని చెబుతున్నారు.
PM Modi: మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఫొటో గ్యాలరీ
రైళ్లు రద్దుకావడం, బస్సులు సక్రమంగా నడవకపోవడంతో ప్రయాణికులకు డ్రైవర్లు అడిగినంత ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ప్రస్తుతం తుపాను ప్రభావంతో చెన్నైలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై చెట్లు కూలిపోయి రవాణాకు ఆటంకం కలుగుతోంది. అనేక వాహనాలు పాడయ్యాయి. తుపాను ప్రభావంతో ప్రజలెవరూ కూరగాయలు, మాంసం కొనేందుకు బయటకు రావడం లేదు. దీంతో సరుకు అలాగే ఉండిపోయింది. దీనివల్ల కూరగాయలు, మాంసం ధరలు భారీగా తగ్గాయి. మార్కెట్లో చాలా సరుకు వృథాగా పోతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.