ట్రంప్ ప్రసంగంలో ఇండియన్ సినిమాలు.. సచిన్, కోహ్లీ గురించి కూడా!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొతేరాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. లక్షా 10 వేల కెపాసిటీ ఉన్న స్టేడియం కిక్కిరిసి పోగా.. ట్రంప్ తన ప్రసంగంలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు నుంచి క్రీడారంగం వరకు అన్నింటి గురించి మాట్లాడారు. మోడీ జీవితం ఎంతో మందికి ఆదర్శం అని ప్రశంసించిన ట్రంప్.. ఒక ఛాయ్ వాలాగా జీవితం మొదలుపెట్టి ఈ స్థాయికి ఆయన చేరుకున్నారని అన్నారు.
ప్రపంచంలో అందరూ ప్రధానిమోడీని అభిమానిస్తారని, మోడీ చాలా కచ్చితమైన వ్యక్తి అని అన్నారు. శ్రమ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనే దానికి మోడీ ఒక రోల్ మోడల్ అని అన్నారు. నా నిజమైన స్నేహితుడు మోడీ అని, :భారతదేశ అభివృద్ధి కోసం నిరంతరం మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ మైదానంలో మోడీకి స్వాగతం పలికామని. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంలో నాకు మోడీ స్వాగతం పలికారని, ట్రంప్ చెప్పుకొచ్చారు.
అలాగే అంతర్జాతీయ క్రికెట్లో మేటి ఆటగాళ్లైన సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ భారతీయులే కావడం గర్వకారణం అని అన్నారు. గొప్ప క్రికెటర్లను ఈ దేశం అందించిందన్నారు. అలాగే DDLJ(దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే), షోలే వంటి సినిమాల గురించి కూడా ట్రంప్ తన ప్రసంగంలో మాట్లాడారు. బాంగ్రా, దిల్ వాలే, షోలే వంటి క్లాసికల్ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు ఆనందిస్తారని అన్నారు. భారతీయులు ఎంకరేజ్ చెయ్యడంలో కూడా ముందుంటారని అన్నారు.
మిలటరీ హెలికాప్టర్లు, ఇతర సామగ్రిని భారత సాయుధ దళాలకు అవసరమైనవాటిని అమ్మేందుకు భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పొందాలు చాలా బలమైనవి అని అన్నారు ట్రంప్. భారత్, అమెరికాల మధ్య ఏర్పడిన ఒప్పొందాలు సంతోషించదగినవి అన్నారు.