నిర్భయ దోషుల సంపాదన ఎంతంటే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.. క్యురేటివ్ పిటిషన్ కూడా కొట్టేశారు. ఇంకేముంది జనవరి 22వ తేదీన ఉదయం 7గంటలకు నిర్భయ కేసులో దోషులైన నలుగురు మృగాళ్లను చనిపోయేవరకు ఉరి తీయనున్నారు.
ఈ సంధర్భంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే .నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లను ప్రత్యేకంగా జైలు గదుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. కట్టుదిట్టమైన జైలు వార్డర్ల భద్రత మధ్య దోషులను నిర్భిందించి ఉంచారు అధికారులు. అయితే వాళ్లు జైలులో ఇంతకాలం చేసిన పనికి గానూ వారు సంపాధించిన డబ్బును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు.
ఇక 2012లో అరెస్ట్ అయిన వీళ్లు ఇప్పటివరకు జైలులో పనిచేసి సంపాదించిన డబ్బు ఎంతనే విషయాన్ని జైలు అధాకారులు వెల్లడించారు. నిందితుల్లో పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లు తిహార్ జైల్లో ఉన్నపుడు చేసిన పనికి పొందిన వేతనాల డబ్బును లెక్కేసిన జైలు అధికారులు.. ముకేశ్ సింగ్ జైల్లో అందరికంటే అత్యధికంగా రూ.69వేలు సంపాదించినట్లు వెల్లడించారు. మరో దోషి వినయ్ శర్మ రూ.39వేలు, పవన్ గుప్తా రూ.29వేలు సంపాదించినట్లు చెప్పారు. మరో దోషి అక్షయ్ కుమార్ జైలులో కూలీగా పనిచేసేందుకు నిరాకరించగా.. అతని దగ్గర ఏ డబ్బు లేదు.
నిర్భయ దోషులు జైల్లో చేసిన కూలీ పనికి పొందిన వేతనాలను వారివారి కుటుంబసభ్యులకు అందజేస్తారు తిహార్ జైలు అధికారులు. అలాగే ఉరి తీస్తున్న క్రమంలోనే నలుగురు దోషులకు పెట్టే భోజనాన్ని తగ్గించారు అధికారులు. తిహార్ జైలులో నిర్భయ దోషి వినయ్ శర్మ పలుసార్లు అనుచితంగా వ్యవహరించాడు. ఇతను జైలు అధికారులకు సహకరించకుండా, భోజనం చేయకుండా ఆరుసార్లు గొడవ చేశాడు. వినయ్ శర్మ ప్రవర్తన జైల్లో సరిగా లేదని, మిగిలిన ముగ్గురు దోషులు జైల్లో బాగానే ఉన్నారని తిహార్ జైలు అధికారులు చెబుతున్నారు.
జైలులో అనుచిత ప్రవర్తన కారణంగా వినయ్ శర్మకు జైలు అధికారులు పదకొండు సార్లు శిక్షలు విధించారు. పవన్‌గుప్తాకు ఎనిమిది సార్లు, అక్షయ్ కుమార్‌కు మూడు సార్లు, ముకేశ్ సింగ్‌కు ఒకసారి జైలు అధికారులు చిన్న చిన్న శిక్షలు వేశారు. నలుగురు దోషులకు చనిపోయే వరకూ ఉరి వెయ్యాలని పటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోరా ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ చేశారు.
ఈ కేసులో రామ్ సింగ్ అనే వ్యక్తి జైలులోనే ఆత్మహత్య చేసుకోగా.. మైనర్ అయిన కారణంగా మరొకరు ఐదేళ్ల శిక్ష తర్వాత బయటకు విడుదల అయ్యాడు. 2015 డిసెంబర్ 20వ తేదీన విడుదలైన అతను కొన్నాళ్ల పాటు ఒక స్వచ్ఛంద సంస్థ వద్ద ఉన్నాడు. తర్వాత వంటవాడిగా మారిపోయాడు. ఆ మైనర్ నిందితుడికి ఇప్పుడు 25 ఏళ్ల వయసు. తన సొంత ప్రాంతానికి దూరంగా.. దక్షిణాదిన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియకుండా ఒక దాబాలో వంటవాడిగా అతను ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడనే విషయం మాత్రం బయటకు రానివ్వట్లేదు.