Prashant Kishor: రాజకీయాల నుంచి తప్పుకుంటా, బీహార్ నుంచి వెళ్లిపోతా..! పీకే మరో సంచలన సవాల్..
తొలి పోటీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ, ఈ ఎదురుదెబ్బ తాత్కాలికమే.
Prashant Kishor: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా నితీష్ కుమార్ ప్రభుత్వానికి మరో సవాల్ విసిరారు. స్వయం ఉపాధి పథకాల కింద 1.5 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు బదిలీ చేస్తామని ఎన్డీఏ ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చినట్లయితే తాను కచ్చితంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను అని పీకే ప్రకటించారు. అంతేకాదు బిహార్ నుంచి వెళ్లిపోతాను అని కూడా అన్నారు.
”రాష్ట్రవ్యాప్తంగా 1.5 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాది కార్యక్రమాల నిమిత్తం 2 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి హామీ ఆ డబ్బులు చెల్లిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. బిహార్ ను విడిచి వెళ్లిపోతా” అని పీకే అన్నారు.
ఎన్నికల్లో జేడీయూకి 25 సీట్లకు మంచి రావడంతో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను పీకే తోసిపుచ్చారు. “జేడీయూ 25 సీట్ల కంటే ఎక్కువ సాధిస్తే, నేను రాజకీయాల నుండి రిటైర్ అవుతానని చెప్పాను. కానీ నేను రాజీనామా చేయాల్సిన ఏ పదవి నాకు ఉంది?” అని కిషోర్ మీడియా సమావేశంలో అన్నారు. “నేను ప్రజల కోసం మాట్లాడటం మానేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. నేను బిహార్ విడిచి వెళ్తానని అని అనుకునే వారిది పొరపాటే అవుతుంది” అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. 200కు పైగా స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట కూడా జన్ సూరజ్ పార్టీ గెలుపొందలేదు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో ఓటమికి తానే పూర్తి స్థాయి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి కష్టపడినా ఓట్లు సాధించడంలో విఫలమయ్యామన్నారు. అందుకు తనను క్షమించాలని పీకే కోరారు.
భవిష్యత్తులో విజయం కచ్చితంగా వస్తుంది..
”ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ పేలవమైన ప్రదర్శనకు బాధ్యతను స్వీకరించా. తొలి పోటీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ, ఈ ఎదురుదెబ్బ తాత్కాలికమే. ఈ రోజు కచ్చితంగా ఒక కుదుపు. కానీ భవిష్యత్తులో విజయం కచ్చితంగా వస్తుంది. నేను బిహార్‌ను వదిలి వెళ్ళను. మేము మూడు సంవత్సరాలుగా చేసిన కృషికి, ఇప్పుడు రెండింతలు కష్టపడి పనిచేస్తాము” అని పీకే చెప్పారు. “మేము తప్పులు చేసి ఉండొచ్చు. కానీ మేము విభజన రాజకీయాలకు పాల్పడలేదు. లేదా అమాయక ప్రజల ఓట్లను కొనుగోలు చేయలేదు” అని పీకే అన్నారు.
నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. భారీ హామీలు, చెల్లింపుల ద్వారా తన అఖండ విజయాన్ని సాధించిందని కిషోర్ ఆరోపించారు. ”మొదటిసారిగా, ఒక ప్రభుత్వం ఎన్నికల సమయంలో దాదాపు రూ. 40,000 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్డీఏకు ఇంత పెద్ద మెజారిటీ రావడానికి అదే ప్రధాన కారణం” అని పీకే అన్నారు.
ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఎన్నికలకు ముందు చెల్లింపులను ప్రత్యేకంగా ప్రస్తావించారు పీకే. “నితీష్ కుమార్, ఆయన విజయం మధ్య ఒకే ఒక విషయం ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 10,000 కు 60,000 ఓట్లు కొనుగోలు చేయడం. ఈ బదిలీ.. ఓట్ల కొనుగోలా? లేక నిజమైన సంక్షేమ చర్యా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలి. ఇది ఓట్ల కొనుగోలా? లేక స్వయం ఉపాధి కార్యక్రమంలో భాగమా? అనేది స్పష్టంగా చెప్పాలి” అని పీకే డిమాండ్ చేశారు.
”మహిళలకు రూ. 2లక్షలు ఇస్తానని జేడీయూ ఆశ చూపింది. ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో తొలి విడతగా రూ.10 వేలు జమ చేసింది. ఇలా ఒక్కో నియోజకవర్గానికి 10 వేల నుండి 60 వేల మంది వరకు డబ్బు జమ చేసింది. ఒకవేళ ఆ విధంగా చేయకుంటే నేను అంచనా వేసిన విధంగా జేడీయూకి 25 సీట్లు దాటేవి కావు” అని పీకే అన్నారు.
”దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోంది. దీనిపై జాతీయ పార్టీలంతా చర్చలు జరపాలి. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి” అని పీకే కోరారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా 6 నెలల్లో మహిళల రూ. 2లక్షలు జమ చేయకపోతే జన్ సూరజ్ పార్టీ వారి పక్షాన పోరాడుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
