షేక్ హసీనాను మాత్రమే క్రిమినల్‌ అని ఎందుకు అంటున్నారు? మరి యూనస్‌ కాదా?: కీలక పాయింట్‌ను లాగిన తస్లీమా నస్రీన్‌

బంగ్లాదేశ్‌లో న్యాయం పేరిట కొనసాగుతున్న నాటకం ఎప్పుడు ముగుస్తుందని నస్రీన్ ప్రశ్నించారు.

షేక్ హసీనాను మాత్రమే క్రిమినల్‌ అని ఎందుకు అంటున్నారు? మరి యూనస్‌ కాదా?: కీలక పాయింట్‌ను లాగిన తస్లీమా నస్రీన్‌

Taslima Nasreen

Updated On : November 18, 2025 / 3:07 PM IST

Taslima Nasreen: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) ఇచ్చిన తీర్పుపై ఆ దేశ బహిష్కృత రచయిత తస్లీమా నస్రీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన షేక్ హసీనాను నేరస్తురాలిగా ఎందుకు చూస్తున్నారని, ముహమ్మద్ యూనస్, ఆయన జిహాదీ దళాలను ఎందుకు అలా చూడటం లేదంటూ ఆమె ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

“హసీనా చర్యలు అన్యాయపూరితమైనవని యూనస్‌తో పాటు ఆయన జిహాదీ దళాలు చెబుతున్నాయి. అవే చర్యలను యూనస్, ఆయన జిహాదీ దళాలు చేసినప్పుడు మాత్రం వాటిని న్యాయమని అంటారు. బంగ్లాదేశ్‌లో న్యాయం పేరిట ఆడుతున్న ఈ నాటకం ఎప్పుడు ముగుస్తుంది?” అని తస్లీమా నస్రీన్‌ ప్రశ్నించారు. (Taslima Nasreen)

“ఎవరైనా విధ్వంసక చర్యలకు పాల్పడినప్పుడు ప్రభుత్వం కాల్పులకు ఆదేశాలిస్తే దాన్ని నేరం అని అనరు. అయితే, గత ఏడాది జూలైలో విధ్వంసకర చర్యలకు పాల్పడిన వారిపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చినందుకు హసీనాను మాత్రం నేరస్తురాలని ఎందుకు అంటున్నారు?” అని ఆమె నిలదీశారు.

“గత ఏడాది జూలైలో తీవ్రవాదులు విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారు. మెట్రోకు నిప్పు పెట్టి, స్నైపర్ల ద్వారా మనుషులను చంపి, పోలీసు అధికారులను హత్య చేశారు. అటువంటి వారిపై విచారణ ఎందుకు జరగడం లేదు? బంగ్లాదేశ్‌లో న్యాయం పేరిట సాగుతున్న నాటకం ఎప్పుడు ముగుస్తుంది?” అని నస్రీన్ అన్నారు.

కొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వంపై నస్రీన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హసీనా పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో యూనస్ మద్దతుదారులు అమానుష చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యూనస్‌కు 2006లో ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోవాలని, ఆయనకు జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేశారు.