Delhi Protest : AAP లీడర్ల తప్పుంటే డబుల్ శిక్ష వేయండి-కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఆప్ నేత తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. దేశ రక్షణ కోసం రాజకీయాలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇలా..ఎవరైనా సరే..ఎవరినీ కూడా వదలవద్దని, తన మంత్రివర్గంలో ఉన్నా సరే..వారికి శిక్ష వేయాలన్నారు.
ఆప్ పార్టీకి చెందిన వారు ఉంటే..వారికి డబుల్ శిక్ష పడే విధంగా చూడాలని సూచించారు. 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఘర్షణలను ఖండించారు. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న వారికి పరిహారం ప్రకటించడం జరుగుతుందన్నారు.
బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామన్నారు. ఫరిస్తే పథకం కింద బాధితులకు ఆహార పదార్థాలతో పాటు..నిత్యావసర వస్తువులు కూడా ఇస్తామన్నారు. ఢిల్లీ అల్లర్లలో 35 మృతి చెందగా, 200 మంది గాయపడ్డారని వెల్లడించారు.
వీరందరికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, రాత్రింబవళ్లు కృషి చేసిన వైద్యులకు, సిబ్బంది కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. అల్లర్లు, హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణలు ప్రకంపనాలు సృష్టించాయి. మూడు రోజులుగా జరిగిన అల్లర్లలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.
ఫిబ్రవరి 27వ తేదీ గురువారం తగ్గుముఖం పట్టాయి. ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ విధించడంతోపాటు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేయడంతో.. అల్లర్లు, ఆందోళనలు తగ్గాయి. దీంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు చేపట్టారు. ఆందోళనల్లో నడిరోడ్లపై ఆహుతైన వాటిని తొలగిస్తున్నారు.
Read More : కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై కేటీఆర్ ఆగ్రహం