ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలరా? చట్టం ఏం చెబుతుంది?

ముఖ్యమంత్రిని జైలు నుంచి పాలన చేయొద్దని అడ్డుకునే చట్టం, నియమం ఏదీ లేదు. అయితే, ఖైదీగా జైలుకు వెళితే.. జైలులో నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలరా? చట్టం ఏం చెబుతుంది?

Delhi Cm Arvind Kejriwal

Delhi Cm Arvind Kejriwal : మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయ్యారు. గురువారం సాయంత్రం సమయంలో సీఎం నివాసంలో ఈడీ బృందం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. సీఎం పదవిలో కొనసాగుతుండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టును రాజకీయ కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది. ఎన్డీయేయేతర పక్షాలన్నీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించాయి. అయితే, ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిషి మాట్లాడుతూ.. కేజ్రీవాలే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడగలరని చెప్పారు. ఏ నియమం వారిని ఆపదు. అతను దోషిగా నిర్దారించబడలేదు. కాబట్టి అతను ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని అతిషి పేర్కొంది.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారు.. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు : మంత్రి అతిషి

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం అనేది ఇబ్బందికరమైన విషయమే అయినా.. ముఖ్యమంత్రిని జైలు నుంచి పాలన చేయొద్దని అడ్డుకునే చట్టం, నియమం ఏదీ లేదు. అయితే, జైలుకు వెళితే.. జైలులో నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. 1951 ప్రజాప్రాతినిద్య చట్టంలో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా జైలుకు వెళితే రాజీనామా చేయాల్సి ఉంటుందని ఎక్కడా పేర్కొనలేదు. చట్టం ప్రకారం.. ముఖ్యమంత్రి ఏదోఒక కేసులో దోషిగా తేలితేనే ఆయనపై అనర్హత వేటు పడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఎలాంటి శిక్షపడలేదు. ఒకవేళ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసినా ఎమ్మెల్యేగా కొనసాగుతారు. చట్టం ప్రకారం.. క్రిమినల్ కేసులో రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్షపడిన ఎమ్మెల్యే, ఎంపీపై అనర్హత వేటు పడుతుంది. కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయరని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్, మంత్రి అతిషితో పాటు పలువురు ఆప్ నేతలు చెబుతున్నారు. జైలులో ప్రతిదీ క్రమపద్దతిలో జరుగుతుంది. జైలు నియమాల ప్రకారం.. జైలులో ఉన్న ప్రతిఒక్కరు తన బంధువులు, స్నేహితులను వారానికి రెండు సార్లు కలిసే అవకాశం ఉంటుంది. జైలులో ఉన్నంతకాలం కోర్టు ఆదేశాలపైనే వ్యక్తి కార్యకలాపాలు కొనసాగుతాయి. తన న్యాయవాది ద్వారా ఏదైనా చట్టపరమైన పత్రంపై సంతకం చేయొచ్చు. కానీ, ఏదైనా ప్రభుత్వ పత్రంలో సంతకం చేయడానికి కోర్టు అనుమతి తప్పనిసరి.

Also Read : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. భారీ భద్రత మధ్య తరలింపు

కేజ్రీవాల్ అరెస్టు తరువాత కొన్నిగంటలకే ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో అరెస్టును సవాల్ చేశారు. గురువారం రాత్రికే విచారణ జరపాలని న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు విజ్ఞప్తి చేయగా.. ఫలితం దక్కలేదు. శుక్రవారం కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కేజ్రీవాల్ అరెస్టు విషయాన్ని సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించనున్నారు. అయితే, సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరుపుతుందా? లేదా అనేది తేలనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు విచారించి కేజ్రీవాల్ కు ఉపశమనం లభిస్తే.. విడుదల కావొచ్చు. కోర్టుతీర్పు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా వస్తే జైలులోనే ఉండాల్సి వస్తుంది. మరోవైపు ఈడీ ఇవాళ కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది. సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈ అధికారులు కేజ్రీవాల్ ను హాజరుపరుస్తారు. పదిరోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు పిటీషన్ దాఖలు చేయనున్నారు.