టపాసులు వద్దు, స్వీట్లతో సంబరాలు చేసుకుందాం

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆరు జిల్లాల్లో హవా చూపించింది. మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో అధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకుగానూ ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 59 స్థానాల్లో ఆప్, 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో ఆప్ శ్రేణులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివస్తున్నారు. అయితే పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. ఆనందోత్సాహల మధ్య కార్యకర్తలు టపాసులు కాల్చొద్దని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ శ్రేణులకు సూచించారు.
టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుందని, దీని వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని కేజ్రీవాల్ సూచించారు. టపాసులు స్థానంలో స్వీట్లు, నామ్‌కీన్స్ పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 36. ప్రస్తుతం ఆప్ 53, బీజేపీ 17 స్థానాల్లో ముందంజలో ఉంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలను గెలుచుకుంది.
ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీకే పట్టం కట్టి సీఎం కేజ్రీవాల్‌కే మళ్లీ మూడోసారి పీఠాన్ని అప్పగించారు. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ ఘన విజయం సాధించింది. 2014లో గెలిచిన అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యరీతిలో తన పదవికి రాజీనామా చేశారు. 49 రోజుల ప్రభుత్వాన్ని ఆయన వదులుకున్నారు.
ప్రజలకు క్షమాపణలు చెప్పి మళ్లీ 2015లో పూర్తి మెజారిటీ సాధించారు. అయితే గడిచిన అయిదేళ్లలో కేజ్రీవాల్ ఢిల్లీని అభివృద్ధి పథంలో నడిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. దీంతో ప్రజలు ఆయన వెంటే నిలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్‌ను గెలిపించారు.
ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఉత్కంఠ రీతిలో ప్రచారం సాగింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ మధ్య .. దూషణల పర్వం కొనసాగింది. ఓ దశలో విద్వేషపూరిత ప్రసంగాలు కూడా చోటుచేసుకున్నాయి. ఢిల్లీని చేజిక్కించుకోవాలనుకున్న బీజేపీ.. ప్రచారం కోసం తమ మేటి టీమ్‌ను రంగంలోకి దింపింది. కానీ కేజ్రీ మాత్రం ఒంటరిగానే తన ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్లారు. ఈసారి ఢిల్లీలో 62.59 శాతమే ఓటింగ్ నమోదు అయ్యింది.
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఆప్ చెలరేగిపోయింది. తాజా ఎన్నికల్లో ఆప్‌కు 52 శాతం, బీజేపీకి 47 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. నేను మీ కుమారుడిని అనుకుంటేనే మాకు ఓటు వేయండి, నేను ఉగ్రవాది అనుకుంటే ఓటు వేయకండి అంటూ కేజ్రీ వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోయారు. 2013లో ప్రారంభమైన ఆమ్ ఆద్మీ జర్నీ.. ఇక ఇప్పుడు కొత్త పుంతలు తొక్కనున్నది. అన్నా హజారాతో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన కేజ్రీ.. రాజకీయ ప్రవేశంతో మరింత చైతన్యాన్ని తీసుకువచ్చారు.