ఫైర్ అవుతున్న ఢిల్లీ..మరో ఘటన: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

  • Published By: veegamteam ,Published On : December 24, 2019 / 04:48 AM IST
ఫైర్ అవుతున్న ఢిల్లీ..మరో ఘటన: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Updated On : December 24, 2019 / 4:48 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 22 ఫైరింజన్లతో మంటల అదుపుచేసుందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడినవారిని సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా కిరారి ప్రాంతంలోని ఓ బట్టల  గోదాంలో  సోమవారం తెల్లవారుజామున సంభవించిన  భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డిన విషయం తెలిసిందే.  గాయపడినవారిని సంజయ్ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శీతాకాలంలోనే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక వేసవి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.