దీపావళి కాలుష్యంపై నాసా హెచ్చరికలు : ఢిల్లీ హై అలర్ట్

దీపావళి పండుగ అందరికీ వేడుక. ఇంటిల్లపాది ఆనందంతో జరుపుకునే పండుగ. క్రాకర్స్ వెలుగుల్లో దేశం వెలిగిపోతుంది. దీపావళి తర్వాత ఏంటీ పరిస్థితి అని ఢిల్లీ వాసులకు భయం పట్టుకుంది. కారణంగా పొల్యూషన్. దీపావళి పండుగకు కాల్చే క్రాకర్స్ తోపాటు వెహికల్ పొల్యూషన్ వల్ల ఢిల్లీలో ఆక్సిజన్ పర్సంటేజ్ పడిపోతుంది. ఈ పరిస్థితిని శాటిలైట్ల ద్వారా గమనించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ఢిల్లీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీపావళికి పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో ఢిల్లీ అధికారులు అలర్ట్ అయ్యారు.
సిటీలో జరుగుతున్న భవన నిర్మాణాలన్నీ ఆపేయాలని శుక్రవారం (అక్టోబర్ 25) రాత్రికి రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలపై కూడా నిఘా పెట్టారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో బాణసంచా వెలుగులపై దృష్టి సారిస్తున్నారు. 2018లో పంజాబ్, హర్యానాలో 5వేల 414 ప్రాంతాల్లో సామూహిక వేడుకలు జరిగాయి. ఈ సంవత్సరం కూడా అది మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ వేడుక తరహాలో పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చినట్లయితే.. కాలుష్యం కోరల్లో ఢిల్లీ వాసులు విలవిల్లాడక తప్పదని హెచ్చరించింది.
ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటలు చేతికి రాగానే వ్యర్థాలను, చెత్తను తగలబెడతారు. ఈ ప్రక్రియ నెలరోజులు ఉంటుంది. ఓ వైపు వెహికల్ పొల్యూషన్, మరోవైపు పంటల ద్వారా వచ్చే పొగ, ఇంకో వైపు బాణాసంచా వల్ల వచ్చే పొల్యూషన్ తో ఢిల్లీ ఈసారి మరింత ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై ముందుగానే అలర్ట్ అయిన ప్రధాని మోడీ ప్రభుత్వం.. పంటలు తగలబెట్టడాన్ని ఆపేందుకు ఉన్న అన్ని అవకాశాల్నీ అమల్లోకి తేవాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాల్ని కోరింది.
సుప్రీంకోర్టు నియమించిన EPCA కూడా.. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకూ భవన నిర్మాణాలేవీ జరగకూడదని ఆదేశించింది. అలాగే… ఢిల్లీ శివార్లలోని బొగ్గుకు సంబంధించిన పరిశ్రమలన్నీ కూడా వచ్చే బుధవారం వరకూ మూసి ఉండబోతున్నాయి.
అక్టోబర్ 15 తర్వాత ఢిల్లీలో మరోసారి వెరీ పూర్ ఎయిర్ క్వాలిటీ ఉన్నట్లు తేలింది. వాయవ్యం నుంచి వచ్చే గాలులు.. అక్కడి దుమ్మును ఢిల్లీకి తెచ్చే ప్రమాదం ఉంది. ఈ వారాంతం నుంచి అవి రాబోతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఢిల్లీలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మానటరింగ్ చేస్తోంది.