ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు
నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

Arvind Kejriwal
ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ కొట్టివేసింది.
అరెస్టు చేయడానికి కావాల్సిన ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయని తెలిపింది. సమన్లు పంపినప్పటికీ కేజ్రీవాల్ విచారణలో జాప్యం చేయడం కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారిపై ప్రభావం చూపుతుందని హైకోర్టు చెప్పింది. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
విచారణలో ముఖ్యమంత్రి ఒక న్యాయం, సాధారణ పౌరుడికి ఒక న్యాయం ఉండడం కుదరదని హైకోర్టు చెప్పింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేకంగా హక్కులు ఏవీ ఉండబోవంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎలా జరగాలన్న విషయాన్ని నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్‌కు చెప్పింది.
ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, మనీలాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అలాగే, ఎన్నికల్లో ఎవరు లబ్ధి పొందారు? ఎలక్ట్రోరల్ బాండ్లను ఎవరు కొనుగోలు చేశారు? అనేది కోర్టుకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. కస్టడీ విషయంలో ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
Also Read: ఫిరాయింపుల గురించి నేను మాట్లాడలేను.. ఎందుకంటే..?: జగ్గారెడ్డి