25 కేజీల బంగారం దొంగతనం, ఐపీఎల్ బెట్టింగ్‌లో నష్టం పూడ్చాలని..

అనతి కాలంలోనే అదృష్టం వచ్చేయాలి. కోట్ల రూపాయలలో సంపద గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఐపీఎల్ బెట్టింగ్‌లు నిర్వహించి భారీగా నష్టపోయాడు. అక్కడితో ఆగక 25కేజీల బంగారం దొంగిలించి మరో తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితులు రాజస్థాన్‌లోని శ్రావణ్, ఢిల్లీలో ఉండే భరత్ నాథ్మల్ సోనీ, సచిన్ షిండేలుగా పోలీసులు గుర్తించారు.
సోనీ అనే వ్యక్తి కరోల్ బాగ్‌లోని బంగారం నగల దుకాణం మెయిన్ బ్రాంచిలో పని చేస్తున్నాడు. హెడ్ ఆఫీసు నుంచి చాందినీ చౌక్‌లో ఉన్న బ్రాంచి ఆపీసుకు బంగారం తీసుకుపోయేవాడు. ఒకరోజు అదే క్రమంలో బంగారం తీసుకుని వచ్చాడు కానీ, హెడ్ ఆఫీసులో దాన్ని అప్పగించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందింది.
‘పరిశోధనలో సోనీ తరచూ అతను ఉండే లొకేషన్స్‌ను మారుస్తూ ఉండేవడని తెలిసింది. సెప్టెంబర్ 25న రాజస్థాన్ పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. అదే రోజున షిండే, శ్రావణ్‌లను ఢిల్లీ, రాజస్థాన్‌లలో అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన్‌దీప్ సింగ్ రాంధవా తెలిపారు.
ఇన్వెస్టిగేషన్లో తాను నగల దుకాణం నుంచి తీసుకెళ్లిన బంగారాన్ని హెడ్ ఆఫీసులో అప్పజెప్పకుండా విడివిడిగా పలు దుకాణాల్లో అమ్మేవాడినని సోనీ ఒప్పుకున్నాడు. ఆ స్థానంలో తాను కరిగించిన బంగారం కానీ, నగదును కానీ, ఆఫీసులో అప్పజెప్పేవాడినని వివరించాడు. ఐపీఎల్ బెట్టింగ్ లో భారీగా నష్టపోయానని ఆ నష్టాలు పూడ్చుకునేందుకు ఈ మార్గాన్ని అనుసరించానని ఒప్పుకున్నాడు.
వీరంతా కలిసి 25.731కిలో గ్రాముల బంగారాన్ని తారుమారుచేశారు. బంధువులు, ఇతర వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నిందితులు దొరికిన తర్వాత వారి నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.