SOS Airlines: జస్పాల్ భట్టి 30ఏళ్ల క్రితమే.. ఇండిగో సంక్షోభాన్ని ఊహించారా? వైరల్ గా మారిన ‘SOS ఎయిర్‌లైన్స్’ క్లిప్.. మీరు చూశారా..

'SOS ఎయిర్‌లైన్' పేరుతో జస్పాల్ భట్టి గతంలో ఒక ఫన్నీ వీడియో తీశారు. ఇప్పుడీ క్లిప్ వైరల్‌గా మారింది.

SOS Airlines: జస్పాల్ భట్టి 30ఏళ్ల క్రితమే.. ఇండిగో సంక్షోభాన్ని ఊహించారా? వైరల్ గా మారిన ‘SOS ఎయిర్‌లైన్స్’ క్లిప్.. మీరు చూశారా..

Updated On : December 7, 2025 / 8:00 PM IST

SOS Airlines: ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో క్యాన్సిల్ అయ్యాయి. అనేక సర్వీసులు రద్దయ్యాయి. అనూహ్యంగా ఇండిగో ఎయిర్స్ లైన్స్ క్రైసిస్ లో చిక్కుకుంది. దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమాన ప్రయాణం అత్యంత కష్టతరంగా మారింది. డిసెంబర్ 7 నాటికి దేశవ్యాప్తంగా 2వేలకి పైగా విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణం సిబ్బంది కొరతే అని నివేదికలు చెబుతున్నాయి.

కాగా, ఇండిగో సంక్షోభాన్ని నటుడు జస్పాల్ భట్టి ముందే ఊహించారా? ఇప్పుడీ ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. జస్పాల్ భట్టి ఐకానిక్ టీవీ షో ఫుల్ టెన్షన్ (ఇదొక సిరీస్) నుండి దశాబ్దాల క్రితం ఒక కామెడీ క్లిప్ వచ్చింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది అచ్చం.. ఇండిగో సంక్షోభానికి అద్దం పట్టేలా ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

‘SOS ఎయిర్‌లైన్’ పేరుతో జస్పాల్ భట్టి గతంలో ఒక ఫన్నీ వీడియో తీశారు. ఇప్పుడీ క్లిప్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్ లైన్స్.. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. ఆ పాత క్లిప్ అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది.

ఈ వీడియోలో భట్టి నటన చాలా సెటైరికల్ గా ఉంటుంది. ఓవర్ బుక్డ్ విమానాలు, అస్తవ్యస్తమైన కౌంటర్లు, తప్పిపోయిన పైలట్లు, కాగితపు పనుల్లో పొరపాట్లు, నిర్వహణలో లోపాలు, సాంకేతిక సమస్యలు, తెలివి తక్కువ ఎయిర్‌లైన్ ఆపరేటర్.. ఇలా విభిన్న పాత్రలను జస్పాల్ భట్టి పోషించారు.

ఈ స్కిట్‌లోని ప్రయాణీకులు ఒక కౌంటర్ నుండి మరొక కౌంటర్‌కు పరిగెడుతూ కనిపిస్తారు. తమ సీట్లను దక్కించుకోవడానికి వేడుకుంటూ, వాదిస్తూ, లంచాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇప్పుడీ క్లిప్‌ ను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇది కాస్త కామెడీగా అనిపించినా.. ఇప్పుడు ఇండిగో సంక్షోభం చూస్తుంటే.. అది వాస్తవికంగా అనిపించిందని అంటున్నారు.

అన్ని పనులు చేసేది ఒక్కరే..

”SOS ఎయిర్ లైన్స్ లో ఒక ప్రయాణికుడు టికెట్ బుక్ చేసుకుంటాడు. అతడు ఎయిర్ పోర్టుకు వస్తాడు. ఎయిర్ పోర్టుకు చెందిన సిబ్బంది ఒకరు లగేజీ తీసుకునేందుకు వస్తాడు. తర్వాత టికెట్ కౌంటర్ లోనూ అతడే కనిపిస్తాడు. ఆ తర్వాత చెకిన్ లోనూ అతడే దర్శనమిస్తాడు. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు.. ఏంటీ దారుణం.. అంటూ ప్రయాణికుడు మండిపడతాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కౌంటర్ కు వెళ్తే అక్కడ కూడా అతడే కనిపిస్తాడు. దాంతో ప్రయాణికుడు షాక్ కి గురవుతాడు. అంతేకాదు.. పైలట్ కూడా నేనే అని ఆ వ్యక్తి చెప్పడంతో అతడు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇక, చివరగా.. అసలు SOS కి అర్ధం ఏంటి అని ప్రయాణికుడు అడగ్గా.. షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఎయిర్ లైన్స్ అని ఆ వ్యక్తి సమాధానం ఇస్తాడు. దీంతో ప్రయాణికుడు మరింత షాక్ కి గురవుతాడు. ఇలా చాలా ఫన్నీగా ఆ వీడియోను తీశాడు జస్పాల్ భట్టి. కట్ చేస్తే.. ఇప్పుడు సరిగ్గా ఇండిగో దుస్థితి సేమ్ టు సేమ్ అలానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

“జస్పాల్ భట్టి తన సమయం కంటే చాలా ముందున్నారు. చాలా తెలివైనవారు. 30ఏళ్ల క్రితమే ఆయన ఇండిగో వైఫల్యాన్ని ఊహించేశారు. అప్పుడే SOS పంపారు” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. నాడు ఈ వీడియోలో చూపించిన పరిస్థితులు.. సరిగ్గా ఇప్పుడు ఇండిగో విషయంలోనూ కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ వైరల్ క్లిప్‌ను చూసిన చాలా మంది.. జస్పాల్ భట్టి సెటైర్ రాసింది.. 1990లకు కాదు.. 2025 కోసం అన్నట్లుగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

ఇండిగో పైలట్లకు అదనపు విశ్రాంతి గంటలను తప్పనిసరి చేసే కొత్త సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలను అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో గందరగోళం నెలకొంది. ఈ నియమాలను నెలల ముందుగానే ప్రకటించినప్పటికీ.. సిబ్బంది, షెడ్యూలింగ్ వ్యవస్థలను సకాలంలో సర్దుబాటు చేయడంలో ఇండిగో యాజమాన్యం విఫలమైందని నివేదికలు చెబుతున్నాయి. వారి నిర్లక్ష్యమే.. ఇప్పుడీ సంక్షోభానికి దారితీసింది.

అదనపు విశ్రాంతి గంటల నిబంధనతో భారీగా పైలట్ల కొరత ఏర్పడింది. డిసెంబర్ 5 నాటికే వెయ్యికిపైగా విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. ఇక డిసెంబర్ 7 న ఆ సంఖ్య మరింత పెరిగింది.

భారతదేశంలో సమయపాలన, సామర్థ్యంతో కూడిన విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో.. ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది. సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంతకాలం తక్కువ సిబ్బందితోనే ఎక్కువ పని గంటలు చేయించుకుంది. ఇప్పుడు కొత్త నిబంధనల కారణంగా ఇండిగో లోపాలు బట్టబయలయ్యాయి.

Also Read: పుతిన్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో ఖరీదైన ఫుడ్ ఐటెమ్ ఇదే.. ధర కేజీ 40వేలు..