లాక్ డౌన్ ఉల్లంఘించిన విదేశీయులు…కొత్త రకం శిక్ష విధించిన పోలీసులు

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2020 / 11:20 AM IST
లాక్ డౌన్ ఉల్లంఘించిన విదేశీయులు…కొత్త రకం శిక్ష విధించిన పోలీసులు

Updated On : April 12, 2020 / 11:20 AM IST

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు కొత్తరకం శిక్ష విధించారు. శనివారం రిషికేష్లోని పాపులర్ టూరిస్ట్ స్పాట్ తపోవన్‌ ఏరియాలో లాక్‌డౌన్ ఉల్లంఘించి షికార్లు చేస్తున్న విదేశీయుల చేత ఒక్కొక్కరితో 500 సార్లు క్షమాపణ వాఖ్యాలు రాయించారు.

లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేదు,నన్ను క్షమించండని ఒక్కొక్కరు 500సార్లు వారంతా ఇంగ్లిష్‌లో రాసి ఇచ్చిన తర్వాత వారిని వారివారి ప్రదేశాలకు వెళ్లనిచ్చారు. తపోవన్ లో 650 మంది విదేశీయులు ఉన్నారు. వీళ్లంతా ఇజ్రాయెల్,ఆస్ట్రేలియా,మెక్సికో,కొన్ని యూరప్ దేశాలకు చెందినవారు అని రుషికేష్ పోలీసులు తెలిపారు. వారు తరచుగా లాక్‌డౌన్ ఉల్లంఘిస్తుండటంతో వారికి గట్టిగా బుద్ధివచ్చేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్షమాపణలు రాయించే పని పెట్టామని స్థానిక పోలీసులు చెప్పారు.

తపోవన్ పోలీస్ చెక్ పోస్ట్ ఇన్ చార్జ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ…కొంతమంది విదేశీయులు లాక్ డౌన్ ను పట్టించుకోకుండా కొంతమంది షికార్లు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో శనివారం తాను మరికొందరు చెక్ పోస్ట్ సిబ్బందితో పాట్రోల్ నిర్వహించి షికార్లు చేస్తున్న 10మంది విదేశీయులను గుర్తించినట్లు తెలిపారు.

ఎటువంటి కారణం లేకుండా లాక్ డౌన్ సమయంలో ఎందుకు తిరుగుతున్నారో వివరించాలని తాము అడుగగా, దానికి సమాధానంగా…తాము ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నాం 1గంట వరకు తిరగవచ్చని అనుకున్నాం. ఆ సమయంలో లాక్ డౌన్ సడలింపు ఉంటుందనుకున్నాం అని విదేశీయులు సమాధానమిచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు.

లాక్ డౌన్ సడలింపు నిత్యావసర సరుకులు కొనుక్కునేవారి కోసం ఉద్దేశించబడిందని,ఎటువంటి కారణంగా లేకుండా షికార్లు చేసేందుకు కాదని తాను వాళ్లకు చెప్పగా,తమకు ఈ విషయం తెలియదు అని విదేశీయులు సమాధానమిచ్చారని వినోద్ కుమార్ తెలిపారు. దీంతో వెంటనే చెక్ పోస్ట్ నుంచి 50-60బ్లాంక్ పేజీలను తెప్పించి ఒక్కొక్కరికి 5 పేజీలు చొప్పున 10మందికి ఇచ్చినట్లు తెలిపారు. దానిపై వారిచేత 500సార్లు సారీ అని రాయించినట్లు వినోద్ కుమార్ తెలిపారు.

ఉత్తరాఖండ్ టూరిజం అధికారులు మరియు COVID-19కంట్రోల్ రూమ్ నుంచి అందిన సమచారం మేరకు…లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో దాదాపు 1500మంది విదేశీయులు ఉండిపోయారు. గత 15 రోజుల్లో సంబంధిత ఎంబసీల ద్వారా 700మంది టూరిస్టులను వారివారి దేశాలకు ఇప్పటికే పంపించారు. కొన్ని రోజుల క్రితం 96మంది అమెరికన్లను డెహ్రూడూన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక ఎయిరిండియా విమానంలో తరలించారు. ఢిల్లీ నుంచి వారు ప్రత్యేక విమానంలో అమెరికాకు చేరుకున్నారు.