డీజిల్‌లో నీళ్లు.. సీఎం కాన్వాయ్‌లోని 19 వాహనాలు నిలిచిపోయిన వైనం.. ఆ తర్వాత..
సాధారణ ప్రజలే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌కే కల్తీ ఇంధనం బాధలు తప్పలేదు.

ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే పటిష్ఠమైన భద్రత, ఎక్కడా ఆగకుండా దూసుకుపోయే వాహనాలతో కాన్వాయ్ ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఏకంగా 19 వాహనాలు ఒకేసారి మొరాయించి, హైవేపై నిలిచిపోయాయి. ఈ భారీ భద్రతా వైఫల్యానికి కారణం ఏంటో తెలిసి అధికారులు అవాక్కయ్యారు. వెంటనే ఒక పెట్రోల్ బంక్‌ను సీల్ చేశారు. అసలేం జరిగింది?
హైవేపై నిలిచిన సీఎం కాన్వాయ్
గురువారం అర్ధరాత్రి సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్‌కు చెందిన 19 వాహనాలను డ్రైవర్లు ఒక పెట్రోల్ బంక్‌లో డీజిల్ నింపించారు. కొన్ని వాహనాలు అక్కడి నుంచి బయలుదేరి హైవేపై కొంత దూరం వెళ్లగానే ఒక్కసారిగా ఆగిపోయాయి. మిగిలిన వాహనాలు పెట్రోల్ బంక్ నుంచి కనీసం కదలలేకపోయాయి. ఈ ఘటనతో కాన్వాయ్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యమంత్రి శుక్రవారం పాల్గొనాల్సిన కీలక కార్యక్రమానికి ఈ వాహనాలు వెళ్లాల్సి ఉండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
వాహనాలు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకోవడానికి డీజిల్‌ను పరీక్షించగా, అసలు విషయం బయటపడింది. ఆ డీజిల్‌లో నీళ్లు కలిసినట్లు (కల్తీ డీజిల్) స్పష్టంగా తేలింది. కాన్వాయ్‌లోని డ్రైవర్ శుభం పరమార్ మాట్లాడుతూ.. “మేము ఇండోర్ నుంచి వస్తున్నప్పుడు ఒక పెట్రోల్ బంక్‌లో ఆగి డీజిల్ నింపాం. ముందు వెళ్లిన కార్లు కాసేపటికే ఆగిపోయాయి. మిగతావి అక్కడే నిలిచిపోయాయి. డీజిల్‌లో నీళ్లు ఉన్నాయని తర్వాత తెలిసింది” అని వివరించారు.
పెట్రోల్ బంక్ సీల్
ఈ సీరియస్ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించారు. స్థానిక నాయబ్ తహసీల్దార్ ఆశిష్ ఉపాధ్యాయ్ నేతృత్వంలో విచారణ మొదలైంది.
“గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డీజిల్ ట్యాంకుల్లోకి నీరు చేరి ఉండవచ్చు” అని పెట్రోల్ బంక్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది.
కారణం ఏమైనప్పటికీ భద్రతా వైఫల్యం కింద ఈ ఘటనను పరిగణించి, అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్‌ను సీల్ చేశారు. యజమానిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవాల సీఎం మోహన్ యాదవ్ రత్నాలలో జరుగుతున్న “ప్రాంతీయ పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాధారణ ప్రజలే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌కే కల్తీ ఇంధనం ముప్పు తప్పలేదు. ఈ ఘటన ఇంధన నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది. ఒకవేళ కాన్వాయ్ ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది.