ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ..! స్వయంగా వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తొలిసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. వీరి మధ్య ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా..

ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ..! స్వయంగా వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump - PM Modi

Updated On : January 28, 2025 / 10:24 AM IST

Modi-Trump: అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా వలస వెళ్లి అమెరికాలో నివాసం ఉంటున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి వారిని ప్రత్యేక విమానాల ద్వారా వారి దేశాలకు పంపిస్తున్నారు. దీంతో ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వెళ్లిన వారు వణికిపోతున్నారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. అయితే, ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫిబ్రవరి నెలలోనే ఆయన అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

Also Read: అమెరికాలో ట్రంప్ వేట.. గుడి, బడి అని లేదు.. ఇండియన్స్ ఉండే రాష్ట్రాల్లో.. గురుద్వారాల్లో కూడా..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తొలిసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. వీరి మధ్య ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య స్నేహం, వ్యూహాత్మక సంబంధాల పటిష్టతకు సంబంధించిన పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని వైట్ హౌస్ కు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. ఇదే విషయాన్ని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ట్రంప్, మోదీ సంభాషణపై మీడియా ప్రశ్నించాగా.. సోమవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) మోదీతో సుదీర్ఘంగా మాట్లాడాను. ఇండియాతో అమెరికాకు మంచి అనుబంధం ఉంది. బహుశా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వైట్ హౌస్ కు రావొచ్చు అంటూ ట్రంప్ పేర్కొన్నారు.

Also Read: Donald Trump: ట్రంప్ గరంగరం.. మాకే ఎదురు చెబుతారా..? మీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్.. ఆ వెంటనే..

ట్రంప్, మోదీ ఫోన్ సంభాషణలో అమెరికాలో అక్రమ వలసదారుల విషయంపైనా చర్చకు వచ్చింది. ఈ విషయంపై ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ వలసదారుల అంశంపైనా మోదీతో నేను చర్చించా. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరియైన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నా అంటూ ట్రంప్ తెలిపారు. ఇదిలాఉంటే.. ట్రంప్ తో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి భాద్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడటం ఆనందంగా ఉంది. మేమిద్దరం ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఎప్పటి నుంచో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ట్రంప్ తన చివరి విదేశీ పర్యటన భారత్ లోనే చేపట్టారు. అయితే, ట్రంప్ ఆహ్వానం మేరకు ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్ ఉంటుందా లేదా అనేది వేచిచూడాల్సిందే. ఒకవేళ మోదీ అమెరికా పర్యటనకు వెళితే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడే అవకాశం ఉంది.