Donald Trump: ట్రంప్ గరంగరం.. మాకే ఎదురు చెబుతారా..? మీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్.. ఆ వెంటనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆట మొదలు పెట్టాడు. చెప్పినట్లే చేసి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో కొలంబియా దేశానికి వార్నింగ్ ఇచ్చారు..

Donald Trump, Gustavo Petro
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆట మొదలు పెట్టాడు. చెప్పినట్లే చేసి చూపిస్తున్నాడు. అమెరికాలో అక్రమ వలసదారులను వారి దేశాలకు తరిమేస్తున్నాడు. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వేలాది మందిని గుర్తించి వారివారి దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ క్రమంలో ట్రంప్ కు కొలంబియా బిగ్ షాకిచ్చింది. అమెరికా నుంచి తమ పౌరులకు సంకెళ్లు వేసి నేరస్తుల్లా విమానాల్లో పంపించడంపట్ల కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిసరైన పద్దతి కాదంటూ పేర్కొన్నాడు. అంతేకాదు.. ఇలా వచ్చే వలసదారుల విమానాలను అనుమతించమని కొలంబియా తేల్చి చెప్పింది. చెప్పినట్లుగానే.. అమెరికా నుంచి తమ దేశానికి వచ్చిన రెండు విమానాలను ల్యాండ్ అయ్యేందుకు అనుమతించలేదు. తిరిగి వెనక్కి పంపించింది. పెట్రో తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ట్రంప్ కొలంబియా అధ్యక్షుడి నిర్ణయంపై ఫైర్ అయ్యాడు.. మాకే ఎదురు చెబుతావా అంటూ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
‘‘కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మాట్లాడుతూ.. వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామని, ఇప్పటికే అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించినట్లు చెప్పారు. నేరస్తులుగా చిత్రీకరించకుండా, అమెరికా పౌర విమానాల్లో పంపిస్తే మాత్రం వాటిని అనుమతిస్తామని పెట్రో స్పష్టం చేశారు.’’ పెట్రో నిర్ణయం పై అమెరికా ప్రభుత్వం స్పందించింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన నేరస్తులను తిరిగి వారి దేశానికి పంపించడమే ఈ విమానాల ఉద్దేశమని తెలిపింది. ఈ క్రమంలో కొలంబియాలో తమ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు పెట్రో అనుమతించక పోవటాన్ని తప్పుబట్టింది. పెట్రో తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా భద్రతా సమస్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అమెరికా అభిప్రాయ పడింది.
అమెరికా నుంచి వెళ్లిన రెండు విమానాలను ల్యాండ్ అయ్యేందుకు కొలంబియా అనుమతి ఇవ్వకపోవటంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొలంబియా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్.. కొలంబియా నుంచి వచ్చే అన్ని వస్తువులపై వెంటనే 25శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. దీనిని వారంలో 50శాతానికి పెంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా తీసుకునే ఈ నిర్ణయం కొలంబియా ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపనుంది. ఇదేకాక.. కొలంబియా ప్రభుత్వ అధికారులు, వారి సహచరులు, మద్దతుదారులపై ప్రయాణ నిషేధం, తక్షణ వీసా రద్దు అమల్లోకి వస్తుందని, అదనంగా కొలంబియా ప్రభుత్వంలోని పార్టీ సభ్యులు, వారి కుటుంబాలపైకూడా వీసా ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అంతేకాదు.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ట్రంప్ కొలంబియాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: WEF: ఛీ ఛీ.. దావోస్‌లో ఓ పక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. మరోపక్క చీకటి బాగోతాలు.. ఏం జరిగిందో తెలుసా?
కొలంబియాపై ట్రంప్ అనేక ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద కొలంబియా ప్రభుత్వంపై అమెరికా ట్రెజరీ, ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. కొలంబియా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం దీని లక్ష్యంగా తెలుస్తుంది. కొలంబియా ప్రభుత్వం తన చట్టపరమైన బాధ్యతలను పాటించడంలో విఫలమైతే మరింత కఠినమైన చర్యలు విధించబడతాయని, కొలంబియాతో వాణిజ్య, దౌత్య సంబంధాలను కూడా పున: పరిశీలించవచ్చునని యూఎస్ ప్రభుత్వం సూచించింది. తాజా పరిణామం రెండు దేశాల మధ్య తీవ్రమైన దౌత్య వివాదంగా మారింది. అయితే, ట్రంప్ వార్నింగ్ కు కొలంబియా దిగొస్తుందా.. ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదురుతుందా అనేది వేచి చూడాల్సిందే.
President Donald J. Trump announces retaliatory measures against Colombia after the country denied illegal alien deportation flights:
-Travel ban.
-Emergency tariffs.
-Financial sanctions.
-Enhanced inspections at the border.
-Visa revocation on government officials. pic.twitter.com/8VDZwzuZDq— America (@america) January 26, 2025