పాకిస్థాన్‌కు ట్రంప్‌ దౌత్యపర రక్షణ.. భారత్‌కు అమెరికా నమ్మదగిన మిత్రదేశమేనా అంటూ భారతీయుల్లో అనుమానాలు

ట్రంప్ తీరు అంతా అమెరికా ప్రయోజనాల మీదే ఆధారపడి ఉంటుంది.

పాకిస్థాన్‌కు ట్రంప్‌ దౌత్యపర రక్షణ.. భారత్‌కు అమెరికా నమ్మదగిన మిత్రదేశమేనా అంటూ భారతీయుల్లో అనుమానాలు

Donald Trump

Updated On : May 22, 2025 / 5:42 PM IST

భారత్‌కు అమెరికా చాలా కాలంగా మిత్రదేశంగా ఉంటోంది. అయితే, అమెరికా నమ్మదగిన మిత్రదేశమేనా? అన్న అనుమానాలు ఇప్పుడు భారతీయుల్లో మళ్లీ కలుగుతున్నాయి. అమెరికా నిజస్వరూపాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయటపెడుతూ ఆ దేశం ఎటువంటిదో తెలుసుకునేలా చేస్తున్నారు.

పాకిస్థాన్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులను వాడుకుంటున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి దౌత్యపరమైన రక్షణ కల్పిస్తుండడం పట్ల భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో యుద్ధాన్ని కోరుకునే భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

భారత్‌ ఇటీవల సైనిక చర్యను ఆపేయడం పట్ల మన దేశ నాయకత్వంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇటువంటి వారు యుద్ధం జరిగితే సంభవించే పరిణామాలు ఏంటన్న విషయాన్ని వివరించలేకపోతున్నారు. భారత సైనిక సామర్థ్యాలు ఏంటి? ప్రాణనష్టం ఎంత సంభవిస్తుంది?

అటు పాకిస్థాన్‌తో భారత్‌ యుద్ధం చేస్తుంటే దీన్ని అవకాశంగా వాడుకుని ఇటువైపు నుంచి చైనా కూడా మన దేశంపై యుద్ధాన్ని ప్రారంభిస్తే జరిగే పరిణామాలేంటి? యుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎంత? వంటి అంశాలను మన దేశంలోని యుద్ధ ప్రియులు ఆలోచించడం లేదు.

వాస్తవిక పరిస్థితులను ఇలా..
వాస్తవిక పరిస్థితులను పరిశీలిస్తే.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదంపై భారత్‌ ఒంటరిగా పోరాడుతోంది. ఇతర దేశాలు నేరుగా ఎలాంటి సాయమూ చేయడం లేదు. దీంతో, సమస్యకు భారత్‌ తన వద్ద ఉన్న సరైన పరిష్కార మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. ఇతర దేశాలపై ఆధారపడకపోవడం, ఆర్థిక రంగ వృద్ధిని కొనసాగించడం, పాకిస్థాన్‌-చైనాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం వంటి పనులు చేయాలి.

భారత్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ వేళ తామే పై చేయి సాధించామంటూ పాకిస్థాన్ పెద్ద ఎత్తున చెప్పుకుంది. పాక్ వాదనల ఆధారంగా పాశ్చాత్య మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వచ్చాయి.

అయితే, నిజమైన విజయాన్ని సాధించింది భారతే. పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. దాడుల్లో పాక్, పీవోకేలోని ప్రాంతాలను కచ్చితమైన రీతిలో భారత్ ఛేదించింది. అయితే, తాము మోహరించిన చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలు విఫలమయ్యాయని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అంగీకరించలేదు.

ఇందుకు రాజకీయ లేదా వ్యూహాత్మక కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో మళ్లీ చోటుచేసుకునేందుకు వీలున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత దౌత్యవేత్తలు సమర్థంగా పనిచేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం భారత్ ఎందుకు అసంతృప్తితో ఉందనే విషయాన్ని అమెరికా అధికారులు గుర్తిస్తున్నప్పటికీ, డొనాల్డ్ ట్రంప్‌ తీరు మాత్రం ఎవరూ నియంత్రించలేరు. అయినప్పటికీ, భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయని అమెరికా అధికారులు అంటున్నారు.

త్వరలో భారత్-అమెరికా మధ్య ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య 2+2 సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే, ఇరు దేశాలను చెందిన ఇద్దరు రక్షణ, ఇద్దరు విదేశీ వ్యవహారాల విభాగాల మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు.

ట్రంప్ ఇన్నర్‌ సర్కిల్‌లో భారతదేశానికి బలమైన సత్సంబంధాలు లేవు. అమెరికాతో సత్సంబంధాల కోసం మనం కేవలం దౌత్యవేత్తలపై (బ్యూరోక్రాట్లు) ఆధారపడితే సరిపోతుందా అనేది అస్పష్టంగా ఉంది. భారత వాదనను ముందుకు తీసుకెళ్లడానికి భారతీయ-అమెరికన్ కమ్యూనిటీని మనం యాక్టివ్‌గా వాడడం లేదు.

ట్రంప్ తీరు అంతా అమెరికా ప్రయోజనాల మీదే ఆధారపడి ఉంటుంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ట్రంప్ ఫ్యామిలీకి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌ కంపెనీతో పాకిస్థాన్ క్రిప్టో ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్థాన్ అగ్ర నాయకులతో ఆ కంపెనీ అధికారులు సమావేశమయ్యారు.

అమెరికాలో మోదీ పర్యటించినప్పుడు ట్రంప్ సర్కిల్‌ను ప్రభావితం చేయడానికి బడా భారతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించితే బాగుండేది. మన లాబీయింగ్ ప్రయత్నాలు బలహీనంగా ఉన్నాయి. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కొన్ని రోజులుగా ట్రంప్ చేస్తున్న కామెంట్స్‌ వల్ల ఆ దేశాన్ని భారత్‌ నమ్మొచ్చా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని మన దేశంలోని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అంటున్నారు.