కర్ణాటకలో ఎత్తుకు పై ఎత్తులు : సోమవారం కుమార స్వామి వీడియో రిలీజ్

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 09:41 AM IST
కర్ణాటకలో ఎత్తుకు పై ఎత్తులు : సోమవారం కుమార స్వామి వీడియో రిలీజ్

Updated On : February 10, 2019 / 9:41 AM IST

కర్ణాటక : రాజకీయాల్లో ఆపరేషన్లు, ఎత్తుకు పై ఎత్తులు కాస్త దారి మళ్ళాయి. ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్‌ ఎమ్మెల్యే కుమారుడితో జరిపిన డీల్‌కు సంబంధించి ఆడియో విడుదలయ్యాక బీజేపీ సైతం అటువంటి ఎత్తుగడలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం సీఎం కుమారస్వామికి సంబంధించిన వీడియో విడుదల చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. 

గతంలో విజయపుర జిల్లాకు చెందిన విజుగౌడ పాటిల్‌ను ఎమ్మెల్సీ చేసేందుకు రూ.25కోట్లు సీఎం కుమారస్వామి డిమాండ్‌ చేసిన వీడియోలు విడుదల చేస్తామని తేల్చారు. ఇందుకు సంబంధించి ఆధారాలు సిద్ధంగా ఉన్నాయని నేరుగా శాసనసభలోనే విడుదల చేస్తామని తేల్చారు. ఇక ఆపరేషన్‌ కమలకు సంబంధించి మరిన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని…అంత సొమ్ము వారికి ఎక్కడిదని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు పరస్పరం ఆడియోలు, వీడియోలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

దీన్నిబట్టి సోమవారం మరిన్ని వీడియోలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా విజయపురలో విజుగౌడ పాటిల్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీ చేసేందుకు కుమారస్వామి రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారన్నారు. అప్పట్లో తాను జేడీఎస్‌లో ఉన్నానని ఎన్నికల వేళ ప్రచారానికి కుమారస్వామి రాలేదని 2008, 2013 ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయానన్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ చేసేందుకు రూ.25 కోట్లు డిమాండ్‌ చేశానన్నారు.