ఢిల్లీ అల్లర్లు : DRP కాన్వెంట్ స్కూల్ మొత్తం దగ్ధం..విద్యార్థుల కన్నీళ్లు

ఈశాన్య ఢిల్లీలో అల్లరిమూకల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పరిస్థితులు మెరుగవుతున్నకొద్దీ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో బయటకొస్తోంది. ముస్తఫాబాద్, బ్రిజ్‌పురి, శివవిహార్‌లో పదుల సంఖ్యలో స్కూళ్లను దుండగులు ధ్వంసం చేశారు. కొన్ని స్కూళ్లు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. శివవిహార్‌లోని DRP స్కూల్ పూర్తిగా ధ్వంసమైంది. తరగతి గదులన్నింటినీ తగలబెట్టారు దుండగులు. విద్యార్థుల సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. పరీక్ష పేపర్లు కూడా నాశనమయ్యాయి.
మొన్నటి వరకు ఉన్న తమ స్కూళ్లు..ప్రస్తుతం ఏ విధంగా ఉందో చూసిన విద్యార్థులు, స్కూల్ అధ్యాపకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనేక వేల మంది విద్యార్థులు ఇందులో చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం DRP స్కూల్ పరిస్థితిని చూసి కన్నీళ్ల పర్యంతమౌతున్నారు.
మానసికస్థైర్యాన్ని దెబ్బతీయాలని దుండగులు ప్రయత్నించారని అంటున్నారు. ఆస్తి నష్టంగా చూడడం లేదని, తమను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని అంటున్నారు అధ్యాపకులు. అయినా..సరే..తాము విద్యార్థుల్లో ధైర్యం తెప్పించి..గత పరిస్థితిని తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు DRP స్కూల్ యాజమాన్యం.
దుండగులు లోనికి చోచ్చుకెళ్లి నానా బీభత్సం సృష్టించారు. స్కూల్ ఫ్యాన్స్ విరగ్గొట్టారు. బ్లాక్ బోర్డ్స్‌ను పగులగొట్టారు. గోడలను ధ్వంసం చేశారు. స్కూల్ పరిసర ప్రాంతాలను గుర్తు పట్టలేకుండా చేశారు. ఎంతో కలర్ ఫుల్‌గా ఉన్న ఆ స్కూల్ మొత్తం బూడిద, నల్లరంగుతో దర్శనమిస్తోంది.
Also Read | ఢిల్లీ అల్లర్లల్లో ఆరుగురు ముస్లింలను కాపాడి తీవ్రగాయాలకు గురైన హిందువు
మరోవైపు…అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. కొత్తగా ఎక్కడా అల్లర్లు చోటు చేసుకోలేదు. భద్రతకు భరోసా కల్పిస్తూ పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించడంతో.. పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి.
ప్రజలు నిత్యావసరాల కోసం వీధుల్లోకి వచ్చారు. రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ అంతా ప్రశాంతంగానే ఉంది. బూడిదైన వాహనాలు, నాశనమైన ఇళ్లు, వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. మూసివేసిన షాపులు ఇప్పుడు మళ్లీ తెరచుకుంటున్నాయి. ఎప్పట్లాగే ఆటోలు, రిక్షాలూ తిరుగుతున్నాయి.
Read More : విద్యుత్ డిమాండ్‌కు తగ్గ సరఫరా..శభాష్ తెలంగాణ విద్యుత్ శాఖ