ఒక వ్యక్తికి ఒకటే ఓటు : ఓటర్ కార్డుతో ఆధార్ లింక్

Fb New Size850x500
ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటరు కార్డులు ఉన్నాయి. దీనికి తోడు నకిలీ అప్లికేషన్లు, బోగస్ ఓట్లు. ఓటర్ జాబితాలో చాలా తప్పులు ఉంటున్నాయి. దీనికి సంబంధించి ఈసీకి చాలా ఫిర్యాదులు అందాయి. దీనిపై ఫోకస్ పెట్టిన ఈసీ.. ప్రక్షాళనకు నడుం బిగించింది. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఉండే ఓటర్ కార్డులకు చెక్ పెట్టే ప్రయత్నాలను మళ్లీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి వ్యక్తి ఓటరు కార్డును వారి ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం(1950) నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలంటూ న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఇలా అధికారం కట్టబెడితే కొత్తగా ఓటర్లుగా నమోదయ్యేవారితో పాటు ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి ఆధార్ కార్డుల నెంబర్లు తీసుకోవడం సాధ్యమవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
నిజానికి గతంలోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అందుకోసం ఈసీ ప్రత్యేక కసరత్తు కూడా ప్రారంభించించింది. అయితే చట్టపరమైన అనుమతి లేకుండా ఏ సంస్థా ఎవరి ఆధార్ కార్డుల వివరాలు సేకరించకూడదని ఆగస్టు, 2015లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. దీనిని అధిగమించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో సవరణలు చేయాలని ఈసీ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదన అమలైతే ఒక వ్యక్తి ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండకుండా నివారించే అవకాశం ఏర్పడుతుంది.
ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ అప్లికేషన్లను, బోగస్ ఓట్లను ఈజీగా గుర్తించి తొలగించవచ్చని ఈసీ పేర్కొంది. ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం వల్ల ఒక్కొక్కరినీ ఒక్క ఓటుకి మాత్రమే పరిమితం చేయవచ్చని కొంతకాలంగా ఈసీ చెబుతోంది. ఈ క్రమంలో దీన్ని అమలు చేసేందుకు న్యాయశాఖకు ప్రతిపాదలను పంపించింది. గతంలో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందం అని చెప్పిన ఈసీ.. 2015లో HS బ్రహ్మ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వచ్చిన తర్వాత తన వైఖరి మార్చుకోవడం గమనార్హం. ఇప్పటికే 32 కోట్ల ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీ కార్డులతో లింక్ అయ్యాయి.