సీఎం అభ్యర్థిగా పళని స్వామి

  • Published By: madhu ,Published On : October 7, 2020 / 11:40 AM IST
సీఎం అభ్యర్థిగా పళని స్వామి

Updated On : October 7, 2020 / 11:59 AM IST

edappadi palaniswami : తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ రచ్చకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం స్వయంగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా సన్మానించుకున్నారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.



మరోసారి పళనిస్వామికే సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వడానికి పన్నీర్‌సెల్వం ఒప్పుకున్నారు. తాను పార్టీ వ్యవహారాల బాధ్యత చూసుకుంటానని ప్రకటించారు. అలాగే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం 11 మందితో స్టీరింగ్‌ కమిటీ వేశారు.



వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే దానిపై అన్నాడీఎంకేలో చాలా రోజుల పాటు వివాదం నడిచింది. కొద్దిరోజుల క్రితం సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోసారి తనకే అవకాశం కావాలని పళని కోరగా… పన్నీర్‌ సెల్వం మాత్రం అందుకు ఒప్పుకోలేదు.



ఈసారి తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని వాదించారు. దీంతో సీఎం అభ్యర్థిని నిర్ణయించే బాధ్యతని అన్నాడీఎంకే కార్యవర్గం తీసుకుంది. దీనిపై చర్చించేందుకు 2020, అక్టోబర్ 07వ తేదీ బుధవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో ఇద్దరు నేతల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పళనిస్వామి ప్రభుత్వ బాధ్యతల్ని… పన్నీర్‌సెల్వం పార్టీ వ్యవహారాల్ని చూసుకోవాలని నిర్ణయించారు.