ఓటరు చేతిలో : మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

  • Published By: madhu ,Published On : October 21, 2019 / 01:16 AM IST
ఓటరు చేతిలో : మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Updated On : October 21, 2019 / 1:16 AM IST

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మహారాష్ట్ర, హర్యానాలతో పాటు 17 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు పోలింగ్ సోమవారం జరుగుతోంది. అక్టోబర్‌ 24న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహారాష్ట్రలో 3 లక్షల మంది భద్రత సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగించనున్నారు. హర్యానాలో ఎన్నికలకు 75 వేల మందితో భద్రత కల్పించారు.  

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు గాను 3,237 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 235 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 8.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.  ఇందులో4.5 కోట్ల మంది పురుషులు కాగా…4 కోట్ల మంది మహిళలు. రాష్ట్రవ్యాప్తంగా 96,661 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరాఠ్వాడాలోని నాందేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 38 మంది పోటీ పడుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్‌-ఎన్‌సిపీ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 

నాగ్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కుథ్రుడ్‌ స్థానం నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్, తొలిసారిగా వర్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన శివసేన యువనేత ఆదిత్య థాక్రే, బారమతి నుంచి శరద్‌పవార్‌ మేనల్లుడు అజిత్‌ పవార్, పర్లి నుంచి పంకజ ముండే, కరడ్‌ స్థానం నుంచి మాజీ సిఎం కాంగ్రెస్‌ అభ్యర్థి ఫృథ్విరాజ్‌ చవాన్, భోకర్ నుంచి మాజీ సిఎం అశోక్‌ చవాన్‌లు తమ  తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 104 మంది మహిళా అభ్యర్థులు. మొత్తం కోటి 83 లక్షల మంది ఓటర్లు కాగా…. 99 లక్షల మంది పురుష ఓటర్లు, 85 లక్షల మంది మహిళా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,357 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. హిసార్‌ జిల్లాలోని హన్సి నియోజక వర్గంలో అత్యధికంగా 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 90 స్థానాల్లో పోటీ పడుతుండగా….ఇండియన్‌  నేషనల్‌ లోక్‌దళ్,దాని మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 

కర్నల్‌ నుంచి హర్యానా సిఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్,  రోహతక్‌ నుంచి మాజీ సిఎం, కాంగ్రెస్‌ నేత భూపిందర్‌సింగ్‌ హూడా,  కైతల్‌ నుంచి రణదీప్‌ సూర్జేవాలా, ఉచన కలాన్‌ స్థానం నుంచి జెజెపి చీఫ్ దుష్యంత్‌ చౌతాలా, దాద్రీ నుంచి బీజేపీ అభ్యర్థి బబిత ఫోగట్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
Read More : పోలింగ్‌కు ఏర్పాట్లు : హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు