54ఏళ్ల తర్వాత… ఆ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ విజయం

54 ఏళ్ల తర్వాత కేరళలోని పాలా నియోజకవర్గంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి అభ్యర్థి మణి సీ కప్పన్ విజయం సాధించారు. గత 54 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేఎం మణి పాలా నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఈ ఏడాది ఏప్రిల్ లో మృతి చెందడంతో ఆ నియోజకవర్గానికి ఈ నెల 23న ఉప ఎన్నిక నిర్వహించారు. ఇవాళ ఫలితాలు వెల్లడించారు.
మణి సి కప్పన్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాయకుడు. కేరళలో ఈ పార్టీ ఎల్డీఎప్ భాగస్వామిగా ఉంది. ఎల్డీఎఫ్ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన మణి సి కప్పన్ చేతిలో కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. పాలా నియోజకవర్గం 1965లో ఏర్పడగా.. కేఎం మణి 13 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేఎం మణి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. ఇక అక్టోబర్ 21న జరిగే మరో ఐదు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కూడా ఎల్డీఎఫ్ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలంటున్నారు.