ప్రముఖ హిందీ కవి, జర్నలిస్ట్ మంగ్లేశ్ దబ్రాల్ కన్నుమూత

Famous Hindi poet Manglesh Dabral passes away ప్రముఖ హిందీ కవి, జర్నలిస్టు మంగ్లేశ్ దబ్రాల్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం(డిసెంబర్-9,2020) రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఉత్తరాఖండ్‌లోని ఓ కుగ్రామంలో జన్మించిన మంగ్లేశ్ దబ్రాల్…‘హామ్ జో దేఖ్తే హై’ కవితా సంపుటి రచనకు 2000 సంవత్సరంలో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన రచించిన పహర్ పర్ లాల్టెన్, ఘర్ కా రాస్తా, హామ్ జో దేఖ్తే హై, ఆవాజ్ భీ ఏక్ జగా హై, నయే యుగ్ మెన్ షత్రు కవితా సంకలనాలు సాహిత్య ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన రచనలను ఔత్సాహికులు అనేక దేశ, విదేశీ భాషల్లోకి అనువదించారు.
జర్నలిస్టుగా కూడా మంగ్లేశ్ దబ్రాల్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. దబ్రాల్ చాలాకాలం హిందీ దినపత్రిక జాన్సత్తాలో పనిచేశారు. భోపాల్‌లోని భరత్ భవన్ నుంచి ప్రచురించే పూర్వాగ్రా పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. అలహాబాద్, లక్నో నుంచి ప్రచురించే హిందీ వార్తా దినపత్రిక అమృత్ ప్రభాత్‌లోనూ కొన్నాళ్లు పనిచేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ లో ఎడిటోరియల్ కన్సల్టెంట్ గా చేరడానికి ముందు సహారా సమయ్‌కు ఎడిటర్ గా సేవలందించారు.