Yediyurappa : తగ్గేదే లే అంటున్న యడియూరప్ప..బీజేపీతో ‘ఢీ’!
కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం యడియూరప్ప బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.

Ya
Yediyurappa కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం యడియూరప్ప బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. సీఎం పదవి నుంచి బలవంతంగా రాజీనామా చేయించిన పార్టీ తీరుపై యడియూరప్ప ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. వాటితోపాటు కొత్త ప్రభుత్వంలో తన కుమారుడికి, అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన బలం చూపించేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని కర్ణాటక రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
సీఎం పదవి నుంచి వైదొలిగిన అనంతరం కొన్నాళ్లు ఎవరితో మాట్లాడకుండా ఉన్న యడియూరప్ప వారం కిందట కుబంబసభ్యులతో కలిసి మాల్దీవులుకు వెళ్లి వచ్చారు. రావడంతోనే మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతాననే సంకేతాలు పంపారు. వినాయకచవితి పండుగ తర్వాత తన కుమారుడితో కలిసి రాష్ట్రమంతా పర్యటిస్తానని గత శుక్రవారం తన సొంత జిల్లా శివమొగ్గ నుంచే యడియూరప్ప ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో యడియూరప్ప నుంచి ఈ ప్రకటన వచ్చింది.
అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తన రాష్ట్రవ్యాప్త పర్యటన వెనుక ఉన్న ఉద్దేశ్యం అని యడియూరప్ప చెబుతున్నప్పటికీ..దీని వెనుక చాలా లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. తనే బీజేపీకి పెద్ద దిక్కు అనిపించేలా యడ్డి వర్గం కార్యాచరణ ఉండనుందని సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి కుమారుడికి బలం చేకూర్చాలని యడ్డియూరప్ప లక్ష్యమని పార్టీలోని ఓ నాయకుడు చెప్పారు. అయితే యడియూరప్ప ప్రతిపాద రాష్ట్రవ్యాప్త పర్యటనకు బీజేపీ హైకమాండ్ ఒప్పుకోవడం లేదని పార్టీ వర్గాల నుంచి సమాచారం. యడియూరప్ప రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టాలంటే…పార్టీలోని ఇతర నాయకులను కూడా పర్యటనలో తన వెంట కలుపుకుని వెళ్లాలని..ఈ టూర్ తండ్రీ-కొడుకు యొక్క వ్యవహారంలా ఉండకూదని బీజేపీ హైకమాండ్ యడియూరప్పకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యడియూరప్ప ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేదానిపై అందరూ ఆశక్తికరంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే యడియూరప్ప తన మద్దతుదారులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికలకు వెళ్లనున్నారని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది.
ఇక,జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా జూలై 28న బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మార్పు తర్వాతలో పరిస్థితులు చక్కబడతాయనుకుంటే ఏం మారలేదని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు తమ శాఖలపై అసహనంతో ఉన్నారు. అప్రాధాన్య శాఖలు ఇచ్చారని సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉండగా.. మరికొందరు సీఎం బసవరాజు బొమ్మైకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం పార్టీ కర్ణాటక ఇన్‌చార్జి అరుణ్‌సింగ్ మూడు రోజుల పర్యటనకు మైసూర్ చేరుకున్నారు. పార్టీలో ఇంకా సద్దుమణగని విబేధాలు, లుకలుకలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి మార్పు తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు.