ప్లీజ్ ఇక్కడే ఉండండి : బీహార్ వలస కార్మికులపై రాష్ట్రాల చూపు

ప్లీజ్ ఇక్కడే ఉండండి..మీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటాం..ఎక్కడకు వెళ్లకండి అంటూ వలస కార్మికులనుద్దేశించి పలు రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. దేశ పురోభివృద్ధిలో వలస కూలీలు, కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు. కరోనా రాకాసి వల్ల దేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో ఎన్నో రంగాలపై ఎఫెక్ట్ పడింది.
ప్రధానంగా వలస కూలీలపై. వీరంతా పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం కాని రాష్ట్రంలోకి ప్రవేశించి జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ తో వీరంతా సొంత రాష్ట్రమైన బీహార్ కు వెళుతున్నారు. ఇప్పటికే కొంతమంది వెళ్లిపోయారు కూడా. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వీరిని ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ రాష్ట్రంలో ఉన్న బీహార్ వలస కార్మికుల క్షేమాన్ని ప్రభుత్వం చూసుకొంటుందని పంజాబ్ రాష్ట్రం ప్రకటించింది.
లాక్ డౌన్ ముగిసిన తర్వాత..తిరిగి పంజాబ్ కు రావొచ్చని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గోధుమ పంటతో తమకు ఎలాంటి సమస్య ఉండబోదని..కానీ వరి పంటపై తమకు ఆందోళన ఉందని..ఎందుకంటే..వలస కూలీలపై ఈ పంట ఆధార పడి ఉందని పంజాబ్ ఆర్థిక మంత్రి బాదల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయ, పరిశ్రమల రంగాలు ఎక్కువగా వలస కూలీలపైనే ఆధారపడుతున్నాయని తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే..బీహార్ వలస కూలీలపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించగానే రాష్ట్రంలో ఉన్న వలస కూలీలకు ఎలాంటి నష్టం రావొద్దని..వారికి అవసరమైన చర్యలు సంబంధిత కాంట్రాక్టర్ లు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా..వారికి ఉచితంగానే రేషన్ బియ్యం, కొంత నగదు ఇస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్…బీహార్ ఉప ముఖ్యమంత్రితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లుల్లో పని చేయాలని కార్మికులకు సూచించాలని, వీరిని తీసుకెళ్లడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని..వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని ఈ సందర్భంగా సోమేష్ కుమారు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లులలో పని చేసే వారు బీహార్ కార్మికులు 95 శాతానికి పైగా ఉండడం విశేషం.
ప్రస్తుతం కూలీలు లేకపోవడం వల్ల రైతుల నుంచే రికార్డు స్థాయిలో వరిని సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారు..బీహార్ కు కేవలం రెండు సార్లు మాత్రమే సొంత రాష్ట్రానికి వస్తుంటారు. హోలీ, ఛత్ పూజ సందర్భంగా వెళుతుంటారు
See Also | కరోనావైరస్‌కు మందు ఆల్కహాల్ అని ఇంటింటికీ పంచుతున్న గవర్నర్