అమిత్ షా ఆఫర్‌కు నో చెప్పేసిన రైతులు

అమిత్ షా ఆఫర్‌కు నో చెప్పేసిన రైతులు

Updated On : November 29, 2020 / 2:20 PM IST

కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న పంజాబ్ రైతుల నిరసన కొనసాగుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతుల డిమాండ్లపై చర్చిస్తామని హామీ ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. వారు దీనికి అంగీకరిస్తే దేశ రాజధానికి వచ్చి చర్చించుకోవాలని చెప్పారు.

ఆదివారం ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ రైతుల కొత్త చట్టం గురించి చర్చిస్తూ.. వ్యవసాయం కొత్త పుంతలు తొక్కేలా ఉంది ఈ చట్టం అని పేర్కొన్నారు. కొత్త హక్కులతో పాటు, కొత్త అవకాశాలు ఇచ్చామని మోడీ అన్నారు.



డిసెంబర్‌ 3న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో చర్చలు నిర్వహిస్తామని అమిత్ ‌షా పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో శనివారం సాయంత్రం అమిత్​ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

విశాలమైన స్టేడియాల్లోకి వారిని తరలించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి అక్కడికి వెళ్లండి. అక్కడ కార్యక్రమాలు చేపట్టేందుకు పోలీసులు అనుమతిస్తారు. డిసెంబర్‌ 3కు ముందే చర్చలు చేపట్టాలంటే వెంటనే నిరసనలు ఆపేయండి. మరుసటి రోజే సమావేశానికి నేను హామీ ఇస్తున్నాను అని అమిత్‌ షా రైతులకు విజ్ఞప్తి చేశారు.



కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. షరతులు పెట్టి చర్చలకు పిలవడం సరికాదని భారతీయ కిసాన్​ యూనియన్​ పంజాబ్​ రాష్ట్ర అధ్యక్షుడు జగ్జిత్​ సింగ్​ తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా సహృదయంతో చర్చలకు పిలుపునిచ్చి ఉండేదని తెలిపారు. ఆదివారం రైతులతో సమావేశమై.. ప్రభుత్వంతో చర్చించే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో నగరంలోనికి వచ్చారు. చట్టాలను వెనక్కి తీసుకొనే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని హెచ్చరించారు. వీరంతా ప్రధాన రహదారుల్లో నిరసన వ్యక్తం చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.



ఈ నేపథ్యంలో విశాలమైన స్టేడియాల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియాలని రైతులతో పోలీసులు చర్చించారు. అందుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ ఇంకా కొందరు రైతులు రహదారులపైనే ఉన్నారు. నిరసనల్లో ఎక్కువగా పంజాబ్‌ రైతులే ఉండటం గమనార్హం.