జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత.. ఆయన ప్రస్థానం ఇలా..
గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాలిక్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చారు. 2019 పుల్వామా దాడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఆగస్టు 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు జమ్మూకశ్మీర్‌కు గవర్నర్‌గా సేవలందించారు. ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలోనే 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ఆ రోజు రాష్ట్రం ప్రత్యేక హోదా కోల్పోయింది. అంటే నేటితో సరిగ్గా 6 సంవత్సరాలు.
గోవా, మేఘాలయా, బిహార్ గవర్నర్‌గానూ మాలిక్ పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా సేవలందించిన మాలిక్ కేంద్రంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖలలో మంత్రి స్థాయిలో పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం
కాగా, 1960 దశకం చివరలో సామాజికవాద దృక్పథంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు మాలిక్. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. భారతీయ క్రాంతి దళ్, కాంగ్రెస్, వీపీ సింగ్ నేతృత్వంలోని జనతా దళ్ వంటి పార్టీల్లో కొనసాగారు. 2004లో బీజేపీలో చేరారు.
చౌధరి చరణ్ సింగ్ సమీప సహచరుడిగా మాలిక్ 1974లో తొలిసారిగా బాగ్‌పట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత చరణ్ సింగ్‌తో కలిసి లోక్ దళ్ చేరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యారు.
1980లో లోక్ దళ్ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ ఎక్కువకాలం కొనసాగలేదు. 1984లో కాంగ్రెస్ చేరి 1986లో మళ్లీ రాజ్యసభకు వెళ్లారు. రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత మాలిక్ 1987లో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వీపీ సింగ్ జనతా దళ్ లో చేరారు. 1989లో అలీగఢ్ నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖలలో మంత్రిగా ప్రమాణం చేశారు.
2004లో అటల్ బిహారి వాజ్‌పేయి నాయకత్వంలో భాజపాలో చేరారు. కానీ, బాగ్‌పట్‌లో ఆర్జేడి అధినేత అజిత్ సింగ్ చేతిలో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. మొదటి మోదీ ప్రభుత్వంలో భూ సంపాదన బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి మాలిక్ చైర్మన్‌గా నియమితుడయ్యారు. ఆయన కమిటీ బిల్లును వ్యతిరేకించడంతో ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది.
గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాలిక్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చారు. 2019 పుల్వామా దాడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
రైతుల ఆందోళనలపై కేంద్రం తీరును తప్పుపడుతూ “రైతులను అవమానపర్చకూడదు, వారితో చర్చ జరగాలి. ఇంత పెద్ద ఆందోళన ఎప్పుడూ జరగలేదు, 600 మంది చనిపోయారు” అన్నారు.