కరోనా వ్యాక్సిన్‌ ఎవరికి ముందుగా వేస్తారు.? ఎంత మందికి ఇస్తారు?

కరోనా వ్యాక్సిన్‌ ఎవరికి ముందుగా వేస్తారు.? ఎంత మందికి ఇస్తారు?

Updated On : January 3, 2021 / 8:36 AM IST

Free distribution of corona vaccine to 3 crore people in the first phase : దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ఇప్పుడిప్పుడే.. అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్‌ ఎవరికి ముందుగా వేస్తారు.? ఎంత మందికి ఇస్తారు.? వ్యాక్సిన్‌ డ్రై రన్‌ అంటే ఏంటి… వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం ఏం చెబుతోంది.? దేశవ్యాప్తంగా తొలివిడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో పలు ప్రదేశాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ జరుగుతున్న తీరును ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ పరిశీలించి ఉచిత వ్యాక్సిన్‌పై ప్రకటన చేశారు. తొలివిడత వ్యాక్సినేషన్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా టీకా అందజేస్తామన్నారు.

ప్రాధాన్యతా క్రమంలో ఉన్న తదుపరి 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై ఓ నిర్ణయానికి రాబోతున్నామని చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న టీకా డ్రైరన్‌పై అనేక వదంతులు వస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని హర్షవర్ధన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీకా సామర్థ్యం, భద్రత, రోగనిరోధకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. పోలియో టీకా ఇస్తున్న సమయంలోనూ ఇలాంటి వదంతులే పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు.

దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌ను నిర్వహించారు. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్‌లో అధికారులు విస్తృతంగా పరిశీలించారు. నిజమైన టీకా ఇవ్వడం తప్ప వాస్తవ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాటించే మొత్తం ప్రక్రియను ఇందులో పాటించారు. డిసెంబరు 28, 29న దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలివిడత డ్రైరన్‌లో తలెత్తిన లోపాల్ని సవరించి కొత్త మార్గదర్శకాల ప్రకారం తాజా డ్రైరన్‌ను నిర్వహించారు. తెలంగాణలో 2 జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో డ్రైరన్‌ నిర్వహించారు.

హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో 25 నుంచి 30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. టీకా పొందే వ్యక్తి ఆరోగ్యకేంద్రానికి వచ్చినప్పటి నుంచి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడం వరకూ అన్ని దశల ప్రక్రియలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

అటు ఏపీలోని 13 జిల్లాల్లో డ్రైరన్‌ నిర్వహించారు. ఒక్కో జిల్లాలో మూడు చొప్పున మొత్తం 39 కేంద్రాల్లో ఈ డ్రైరన్‌ ప్రక్రియ కొనసాగింది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు ముందుగానే సమాచారం ఇచ్చారు. అన్ని జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోనూ మరోసారి డ్రై రన్‌ నిర్వహించారు. మొత్తంగా దేశంలో కరోనా టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతిచ్చింది.