కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక యాప్

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2020 / 10:30 AM IST
కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక యాప్

Updated On : December 9, 2020 / 11:39 AM IST

Free mobile app Co-WIN to self-register for Covid-19 vaccine భారత్ లో మరికొద్ది రోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ తో సహా మూడు వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌లు తమ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ద‌ర‌ఖాస్తు కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అసలు దేశంలో మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుందన్న వివరాలను మంగళవారం(డిసెంబర్-8,2020)కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.



మంగళవారం కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ మీడియాతో మాట్లాడుతూ…దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించ‌డానికి ప్ర‌భుత్వం ఓ యాప్ క్రియేట్ చేసిందని తెలిపారు. ఈ యాప్ పేరు Co-WIN. ఎల‌క్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వ‌ర్క్ (eVIN)కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్ష‌న్‌. ఈ యాప్‌ ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌లో భాగ‌మ‌య్యే ప్ర‌తి ఒక్క‌రికీ(అడ్మినిస్ట్రేట‌ర్లు, వ్యాక్సినేట‌ర్లు, వ్యాక్సిన్ షాట్స్ అందుకునే వాళ్లు) ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది.



ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ సరఫరా చేయబడుతుంది. మొద‌టి, రెండో ద‌శ‌ల్లో ఈ వ్యాక్సిన్‌ ను ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, క‌రోనాపై పోరాడుతున్న ఇత‌ర ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు ఇవ్వ‌నున్నారు. మూడో ద‌శ‌లో క‌రోనా ప్ర‌మాదం ఎక్కువ‌గా పొంచి ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తారు. ఈ ద‌శ నుంచే వ్యాక్సిన్ కోసం రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. ఈ ప్ర‌క్రియ అంతా Co-WIN యాప్ ద్వారానే న‌డుస్తుంది.



ఇందులో మొత్తంగా ఐదు మాడ్యూల్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేట‌ర్ మాడ్యూల్‌, రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్‌, వ్యాక్సినేష‌న్ మాడ్యూల్‌, బెనిఫిషియ‌రీ అక్‌నాలెడ్జ్‌మెంట్ మాడ్యూల్‌, రిపోర్ట్ మాడ్యూల్ ఉంటాయి. ఇందులోని రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్ ద్వారా వ్యాక్సినేష‌న్ కోసం రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. మొత్తంగా వ్యాక్సినేష‌న్ మొద‌టి విడ‌త‌లో భాగంగా కోటి మంది హెల్త్ వర్కర్లు,2కోట్ల మంది ఇతర ఫ్రంట్ టైన్ వర్కర్లు, వయస్సు ఆధారంగా ఎంపిక చేసిన 27కోట్ల మంది ప్రజలకి కలిపి మొత్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తామ‌ని రాజేష్ భూష‌ణ్ తెలిపారు.