ఎయిర్ ఇండియాకు ఆయిల్ నిలిపివేత: కంపెనీల హెచ్చరిక

నెలవారీగా బిల్లులు చెల్లించకుంటే అక్టోబర్ 18వతేదీ నుంచి ఆయిల్ సరఫరాను నిలిపివేస్తామని ఎయిర్ ఇండియాను ఆయిల్ కంపెనీలు హెచ్చరించాయి. దేశంలోని ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియాకు అక్టోబర్ 18వతేదీ నుంచి ఆయిల్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు ఈ మేరకు అల్టిమేటం జారీ చేశాయి.
గత 8 నెలలుగా ఎయిర్ ఇండియా రూ.5వేల కోట్ల ఆయిల్ బిల్లులు కట్టకుండా పెండింగ్ లో ఉంచినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. దేశంలోని కొచ్చి, మొహాలీ, పూణే, పాట్నా, రాంచీ, వైజాగ్ విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా విమానాలకు ఆగస్ట్ 22వతేదీన ఆయిల్ సరఫరాను ఆయిల్ కంపెనీలు నిలిపివేశాయి.
అయితే కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవడంతో మళ్లీ ఆయిల్ కంపెనీలు సెప్టెంబరు 7వ తేదీన ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాను కొనసీగించాయి. అయితే నెలవారీగా ఎయిర్ ఇండియా డబ్బు చెల్లించకుంటే ఆరు ప్రధాన విమానాశ్రయాల్లో ఆయిల్ సరఫరాను నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీలు హెచ్చరించింది.
మొత్తం రూ. 8వేల 4వందల కోట్ల నష్టాల్లో మునిగి, రూ. 60వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరాను నిలిపివేస్తే మరింత నష్టం వచ్చే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రిత్వశాఖ భావిస్తుంది. అయితే ఆయిల్ కంపెనీల నిర్ణయంలో మార్పు లేకుంటే మాత్రం ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలు సాగే అవకాశం లేదు.