Nitin Gadkari: గడ్కరీ మనసులో ఏముంది? నిజంగా ఆయనకు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందా?
శివసేన చెప్పినట్లు ఇండి కూటమిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఎన్‌సీపీ నేత శరద్‌పవార్..

Union Minister Nitin Gadkari
ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటారు… ఇప్పుడు ఈ డైలాగ్‌ను ఇంకోలా కూడా చెబుతున్నారు. పొలిటీషన్ ప్రకటనలకు కూడా అర్థాలు వేరేగా ఉంటాయట…. మనసులో ఒకటి… చెప్పే మాట ఇంకొకటి అనేది చాలా మంది పొలిటీషన్స్‌పై వినిపించే విమర్శలు.. తమకు కావాల్సినవి సాధించుకోడానికి ఇన్‌డైరెక్ట్ ప్రయత్నాలు చేయడంలో మన నేతలకు సాటివ్వరూ ఉండరని అంటారు. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ మాటలను కూడా ఇలానే అర్థం చేసుకోవాలా? తనకు విపక్షాలు ప్రధాని పదవి ఆఫర్ చేశాయన్న గడ్కరీ ప్రకటన వెనుక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి?
నితిన్ గడ్కరీ.. కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి.. ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఒకే శాఖను నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ… తాజాగా చేసిన ఓ ఆసక్తికర ప్రకటన పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఓ విపక్ష నేత తనకు ప్రధాని పదవిని ఆఫర్ చేశారన్న నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
నిజంగా గడ్కరీకి ఎవరైనా ప్రధాని పదవిని ఆఫర్ చేశారా? చేస్తే ఏ పార్టీ నుంచి అలాంటి ఆఫర్ వచ్చి ఉంటుందనే చర్చ ఓ వైపు సాగుతుండగా, మహారాష్ట్రకు చెందిన శివసేన ఉద్ధవ్ వర్గం నితిన్ గడ్కరీ మనుసులో మాటను ఇలా బయటపెట్టారని విమర్శలు గుప్పించింది. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటనపై ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు.
గడ్కరీకి ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు
మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీ ప్రధాని మోదీ ప్రభుత్వంలో కీలక నేత. గడ్కరీకి ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెబుతుంటారు. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతోనే గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు నితిన్ గడ్కరీ. ప్రధానిగా మోదీ వారసుడు ఎవరనే విషయంపై బీజేపీలో జరిగే చర్చకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్నవారంతా గడ్కరీ పేరునే సూచిస్తుంటారని చెబుతుంటారు.
నిజానికి ప్రధాని మోదీ తర్వాత నెంబర్ 2గా హోంమంత్రి అమిత్‌షా, ఆయన తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటివారు బీజేపీలో ఎందరో ఉన్నా…. నితిన్ గడ్కరీ కూడా ప్రధాని పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఐతే ప్రధాని మోదీ స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆ సంభాషణలన్నీ తెరచాటుకే పరిమితం. ఎవరూ బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా, ఇప్పుడు కేంద్రమంత్రి గడ్కరీ పరోక్షంగా తన అభిలాషను వ్యక్తం చేశారా? అని సందేహిస్తున్నారు.
గడ్కరీకి సరైన గుర్తింపు ఉన్నట్లే
విపక్షం నుంచి తనకు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని కేంద్ర మంత్రి గడ్కరీ ఇప్పుడే ఎందుకు ప్రకటన చేశారనే చర్చ జరుగుతోంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు కావస్తుండగా, గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నట్లు చెబుతున్నారు. మోదీ మంత్రివర్గంలో తొలి నుంచి కొనసాగుతున్న గడ్కరీ ఇప్పటివరకు ఒకేశాఖను చూస్తూ వచ్చారు. తన మంత్రివర్గ సహచరుల శాఖలను గత రెండు ప్రభుత్వాల్లో మార్చిన ప్రధాని మోదీ… గడ్కరీకి మాత్రం మూడు సార్లు ఒకేశాఖను కేటాయించారు.
అంటే ప్రధాని మోదీ వద్ద కూడా గడ్కరీకి సరైన గుర్తింపు ఉన్నట్లేనని చెబుతున్నారు. కానీ, ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏమైవుంటుందని పరిశీలకులు ఆరా తీస్తున్నారు. ప్రధాని మోదీ తర్వాత తాను రేసులో ఉన్నానని చెప్పుకోడానికే గడ్కరీ ఇలాంటి ప్రకటన చేశారా? అని అంతా సందేహిస్తున్నారు. నిజంగా ప్రతిపక్షాల నుంచి అలాంటి ఆఫర్ వచ్చివుంటే… అప్పుడే ఈ ప్రకటన చేసేవారు కదా? అని గడ్కరీ ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. దేశాన్ని నడిపించే నాయకులు ఇండి కూటమిలో ఎందరో ఉండగా, బీజేపీ నుంచి అరువు తెచ్చుకోడానికి తాము సిద్ధంగా లేమని శివసేన ప్రకటన కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది.
శివసేన చెప్పినట్లు ఇండి కూటమిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఎన్‌సీపీ నేత శరద్‌పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటి నేతలు ప్రధాని రేసులో ఉన్నారనే ప్రచారం ఉంది. నిజంగా ఇండి కూటమికి మెజార్టీ వస్తే వీరిలో ఎవరో ఒకరు పీఎం అయ్యే అవకాశం ఉండేది. కానీ, గడ్కరీకి ఎందుకు ఆఫర్ ఇస్తారు? అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు. గడ్కరీ చెప్పినట్లు ప్రధాని పదవిపై ఆశ లేకపోతే ఇప్పుడు ఎందుకిలా ప్రకటన చేయాల్సివచ్చిందనేది? ఆరా తీస్తున్నారు. మొత్తానికి గడ్కరీ మనసులో మాటలను ఇలా బయటపెట్టారా? అనే చర్చే ఎక్కువ జరుగుతోంది.
అలా అడ్డంగా బుక్ అయిపోతే ఎలా? వీళ్లు తప్పు చేశారా? తప్పించుకోలేక దొరికిపోయారా?