Jammu Kashmir : ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే .. బంగారు నాణెం ఇస్తున్న సర్పంచ్..
ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే..ఒక బంగారు నాణెం ఇస్తున్నారు ఓ గ్రామ సర్పంచ్..

'Give Polythene, Take Gold Coin'.. Jammu Kashmir Village
Jammu Kashmir : ప్లాస్టిక్ ..ప్లాస్టిక్ ..ప్లాస్టిక్.. ఎక్కడ చూసినా అదే. బయటకు వెళ్లేటప్పుడు చేత్తో ఓ సంచి పట్టుకెళ్లే అలవాటుని తప్పించేశాయి పాలిథిన్ కవర్లు. ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే. దీంతో పర్యావరణం నాశనమైపోతోందని పర్యావరణవేత్తలు ఎంతగా చెబుతున్నా వీటి వినియోగానికి మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. కొన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలను నియంత్రించేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే అల్పాహారం ఇస్తామని..లంచ్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించి ప్లాస్టిక్ నిర్మూలనపై అవగహన కల్పిస్తున్నారు. జమ్మూ- కశ్మీర్‌లోని ఓ గ్రామంలో పాలిథిన్ వ్యర్థాల నిర్మాలనకు ఓ వినూత్న ప్రకటన చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగ పారేందుకు చెక్ పెడుతూ పాలిథిన్ వ్యర్ధాలు ఇస్తే ఓ ‘బంగారు నాణెం’ఇస్తామని ప్రకటించారు. 20 క్వింటాళ్ల పాలిథిన్ వ్యర్థాలను తీసుకొస్తే.. ఓ బంగారు నాణెం ఇస్తామని ప్రకటించారు.
జమ్మూ- కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని సదివార గ్రామంలో 2022 నుంచి గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు ఇళ్లలోనే చెత్త గుంతలు నిర్మించేలా సర్పంచ్ ఫారూక్ అహ్మద్ గనాయి ( Farooq Ahmad Ganaie)గ్రామస్థులను ఒప్పించారు. కానీ పాలిథిన్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవటానికి ఏళ్లపాటు సమయం పడుతుంది. దీంతో పాలిథిన్ వ్యర్థాలు కుళ్లిపోకుండా అలాగే మిగిలిపోతుండటంతో సర్పంచ్ మరోలా ఆలోచించారు.
20 క్వింటాళ్ల పాలిథిన్ వ్యర్థాలు తీసుకొచ్చేవారికి ఓ బంగారు నాణెం ఇస్తామని ప్రకటించారు. 20 క్వింటాళ్ల కంటే తక్కువ ఇచ్చినవారికి వెండి నాణెం ..అంతకంటే తక్కువ తీసుకొస్తే రివార్డు ఇస్తామని ప్రకటించారు. దీంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో ప్రకటించినట్లుగానే సర్పంచ్ గనాయి ఆయా ప్లాస్టిక్ మొత్తానికి తగినట్లుగా బహుమతులు అందజేస్తున్నారు.
సదివార గ్రామం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి స్థానికంగా ఉండే ఓ యువ క్లబ్ సహకరిస్తోంది.ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలు.. పొలాలు, నీటి వనరుల్లో చేరుకోకుండా అడ్డుకోవటానికి ఇటువంటి కార్యక్రమం చేపట్టామని సర్పంచ్ తెలిపారు. మన పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందని..ఈ కార్యక్రమాలను చేపట్టకపోతే ముప్పు తప్పదని రాబోయే పదేళ్లలో స్థానికంగా సారవంతమైన భూమి, స్వచ్ఛమైన నీటి వనరులు కనిపించకుండాపోతాయని సర్పంచ్ గనాయి అన్నారు.
పాలిథిన్ నిర్మూలన కోసం సర్పంచ్ గనాయి చేప్పట్టిన ఈ చక్కటి కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం సర్పంచ్ గనాయి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని త్వరలోనే అనంతనాగ్‌లోని ఇతర గ్రామాల్లో కూడా ఈ ఆలోచనలను అమలు చేసే ప్రయత్నాలు చేస్తోంది.