PM Narendra Modi : బీహార్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ కొత్త అస్త్రం.. వారికి 46శాతం రిజర్వేషన్లు..? దేశవ్యాప్తంగా ప్రభావం చూపేలా స్కెచ్
PM Narendra Modi : బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

PM Narendra Modi
PM Narendra Modi : బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా బడుగు, బలహీన వర్గాలుగా ఉంటూ వస్తున్న ఓబీసీల ఓటు బ్యాంకును కంచుకోటగా మాలుచుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. గత పదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తలాక్, ఆర్టికల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్, జమ్మూ కశ్మీర్ విభజన, సీఏఏ లాంటి వాటిని సమర్థవంతంగా అమలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో మరికొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఓబీసీలకు 46శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ప్రభావం చూపించేలా ప్రధాని మోదీ తాజా స్కెచ్ ఉండబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పించాలనే నిర్ణయంకు 2019లోనే బీజం పడింది. ఆ సమయంలో పార్టీలో కొంతమంది వ్యతిరేకించడంతో దానిని కొనసాగించలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీ దాన్ని అందుకొని జనంలోకి వెళ్లింది. ప్రతి ఎన్నికల్లో ఓబీసీ అంశాన్ని లేవనెత్తుతూ వచ్చింది. ఎన్నికల ప్రచారంలోనూ ఉపయోగిస్తుంది. అయితే, త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో 10లక్షల మందితో సభను ఏర్పాటు చేసి.. ఆ సభలో ఓబీసీలకు 46శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం.
ఓబీసీలకు 46శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు.. ఏ విధంగా అమలు చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బీహార్ ఎన్నికల సమయంలో దీన్ని బ్రహ్మస్త్రంగా ప్రయోగించేందుకు బీజేపీ పెద్దలు యోచిస్తున్నారని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. బీహార్ రాష్ట్రంలో 85శాతం బీసీలే ఉన్నారు.. వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి అండగా ఓబీసీలు ఉన్నారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీల్లో ఓటు బ్యాంక్ ఎక్కువే.
కేవలం బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సమయం వరకు ఓబీసీ 46శాతం రిజర్వేన్ల అంశం పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా.. ఈ విషయంపై చర్చ జరగాలని, ఆమేరకు దేశవ్యాప్తంగా ఓబీసీ ఓటు బ్యాంకును తమవైపుకు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది.
ప్రధానంగా ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ముద్ర చెరగని విధంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే, త్వరలోనే దీనిని మోదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఢిల్లీలోని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.