గోవా సీఎం పారికర్ కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2019 / 02:36 PM IST
గోవా సీఎం పారికర్ కన్నుమూత

గోవా సీఎం మనోహర్ పారికర్(63) ఇక లేరు.కొద్ది సేపటి క్రితమే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు డాక్టర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.గతేడాది మార్చిలో క్యాన్సర్ బారిన పడిన ఆయన ట్రీట్మెంట్ కోసం అమెరికా కూడా వెళ్లివచ్చారు.ఢిల్లీ ఎయిమ్స్,ముంబై,గోవాలోనూ ఆయన ట్రీట్మెంట్ పొందారు. 2014-17మధ్య కాలంలో మోడీ కేబినెట్ లో రక్షణశాఖమంత్రిగా పారికర్ పనిచేశారు.ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి సీఎం,కేంద్రమంత్రి వరకు ఎదిగిన పారికర్ కు క్లీన్ ఇమేజ్ ఉంది.

పారికర్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధాని నరేంద్రమోడీ,ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు,బీజేపీ నేతలు,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు విచారం వ్యక్తం చేశారు. పారికర్ మృతి చెందిన వార్త తెలిసి తాను చాలా భాధపడ్డానని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు. దేశం,గోవా ప్రజలు పారికర్ ను మర్చిపోలేరన్నారు.

మనోహర్ పారికర్‌ తొలిసారి 1994లో గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000, అక్టోబర్-24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002, ఫిబ్రవరి- 27 వరకు ఆ పదవిలో ఉన్న పారికర్‌ మళ్ళీ 2002, జూన్-5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా తన చతురతతో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, దిగంబర్ కామత్‌ సీఎం అయ్యారు. అయితే, 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో మరోసారి సీఎంగా భాధ్యతలు చేపట్టిన ఆయన మొత్తం నాలుగుసార్లు గోవా సీఎంగా పనిచేశారు.

పారికర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో.. పాక్ భూభాగంలోకి వెళ్లి భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ భారత్ జోలికొస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఉగ్రమూకలకు వెన్నులో వణకు వచ్చేలా చేసింది.