టూరిస్టులకు కేంద్రం బంపరాఫర్…మీ పర్యటన ఖర్చులన్నీ ప్రభుత్వమే ఇస్తుందట

మీకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమా? దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యటించేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారా? అయితే మీకో శుభవార్త. పర్యాటక ప్రేమికులకు శనివారం(జనవరి-25,2020) కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఉన్న 15 పర్యాటక ప్రదేశాలను చుట్టి వచ్చేవారికి ప్రయాణ ఖర్చులన్నీ తామే భరిస్తామని కేంద్రం తెలిపింది.
ప్రయాణికులకు వారి ప్రయాణ ఖర్చులను ప్రోత్సాహకంగా స్పాన్సర్ చేయడం ద్వారా బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు శనివారం కోణార్క్ లో జరిగిన రెండు రోజుల జాతీయ పర్యాట సదస్సు ముగింపు కార్యక్రమంలో టూరిజం మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పర్యటన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి అతడు/ ఆమె భారత దేశంలోని 15 పర్యాటక ప్రదేశాలను(సొంత రాష్ట్రంలో కాకుండా) చుట్టి రావలసి ఉంటుంది.
ఒక సంవత్సరం లోపు ఈ టాస్క్ ను పూర్తి చేసిన అభ్యర్థులను మాత్రమే కేంద్రం రివార్డ్ తో సత్కరిస్తుంది. ఆయా ప్రదేశాల్లో పర్యటించిన వాళ్లు తమ ఫొటోలను పర్యాటక శాఖ వెబ్ సైట్ లో పెట్టాల్సి ఉంటుందని ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది.
అదే విధంగా టూరిస్ట్ గైడ్స్ గా పని చేయాలనుకునే వారికి కూడా పర్యాటక మంత్రిత్వ శాఖ తరపున సర్టిఫికెట్ ప్రోగ్రాం ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా టూరిస్టులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమం తలప్రెట్టినట్టుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబందించిన సమాచారాన్ని అధికారిక వెబ్ సైటు ద్వారా తెలియజేస్తామన్నారు.