Regional Transport Office : డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు..తెలుసుకోవాల్సిన విషయాలు

అక్రిడేటెడ్‌ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలకు కొన్ని తప్పనిసరి నిబంధనలను విధిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం అభ్యర్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడానికి ప్రతి డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంలో సిమ్యులేటర్‌, ప్రత్యేక డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ ఉండాల్సిందే.

Regional Transport Office : డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు..తెలుసుకోవాల్సిన విషయాలు

driver training center

Updated On : June 12, 2021 / 8:35 PM IST

Driver Training Center : అక్రిడేటెడ్‌ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలకు కొన్ని తప్పనిసరి నిబంధనలను విధిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం అభ్యర్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడానికి ప్రతి డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంలో సిమ్యులేటర్‌, ప్రత్యేక డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ ఉండాల్సిందే. మోటారు వాహనాల చట్టం 1988లోని నిబంధనలను అనుసరించి ఈ కేంద్రాల్లో రెమిడియల్‌, రిఫ్రెషర్‌ కోర్సులు అందుబాటులో ఉండాలి.

శిక్షణ సంస్థ గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరి చేసింది కేంద్ర రవాణాశాఖ. వాటి ప్రకారం.. లైట్‌ మోటార్‌ వెహికల్ వరకూ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు గుర్తింపు పొందాలంటే.. కనీసం ఒక ఎకరా స్థలం ఉండాలి. మీడియం, భారీ ప్యాసింజర్‌, సరకు రవాణా వాహనాలు, ట్రెయిలర్స్‌ నడపడంలో శిక్షణ ఇవ్వడానికి కేంద్రం నడపాలంటే కనీసం రెండెకరాల స్థలం ఉండాలి.

శిక్షణ కేంద్రాలకు కనీసం రెండు తరగతి గదులుండాలి. థియరీ తరగతులు, ట్రాఫిక్‌ నిబంధనలు, డ్రైవింగ్‌ ప్రక్రియ, వాహన మెకానిజం, ప్రజాసంబంధాలు, ప్రాథమిక చికిత్స విషయాలపై పాఠాలు చెప్పేందుకు కంప్యూటర్‌, మల్టీమీడియా ప్రొజెక్టర్‌ శిక్షణ సంస్థ ఉపయోగించాల్సి ఉంటుంది. శిక్షణ కేంద్రానికి బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ తప్పనిసరి. రివర్స్‌, పార్కింగ్‌, ఎగుడు, దిగుళ్లలో వాహనం నడిపేందుకు అన్ని రకాల డ్రైవింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేసుకోవాలి. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వ్యవస్థ, అర్హులైన శిక్షకులు, ఈ-పేమెంట్స్‌ సౌకర్యాలు తప్పనిసరి. టీచింగ్‌ సిబ్బంది తగిన సంఖ్యలో ఉండాలి.

శిక్షణ ఇచ్చే అన్ని వాహనాలకు బీమా తప్పనిసరిగా ఉండాలని కొత్త నిబంధనల్లో తెలిపింది కేంద్రప్రభుత్వం. శిక్షణ కేంద్రం నిర్వాహకుడు, అందులో డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే శిక్షకులకు కనీసం 12వ తరగతి విద్యార్హత, డ్రైవింగ్‌లో కనీసం అయిదేళ్ల అనుభవం, మోటార్‌ మెకానిక్స్‌లో ప్రొఫిషియన్సీ టెస్ట్‌ సర్టిఫికెట్‌కానీ ఉండాలి. డ్రైవింగ్‌ స్కూల్‌కు ఒకసారి అక్రిడిటేషన్‌ మంజూరుచేస్తే.. అయిదేళ్లపాటు అది అమల్లో ఉంటుంది. గడువు ముగిసేందుకు 60 రోజుల ముందు రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలతో గుర్తింపు పొందిన కేంద్రాల్లో డ్రైవింగ్‌ నేర్చుకున్నవారికి శిక్షణ పూర్తయిన వెంటనే లైసెన్సు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కేంద్రాల్లో పారిశ్రామిక ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు ప్రత్యేక డ్రైవింగ్‌ శిక్షణ ఇవ్వడానికి అనుమతి ఇస్తారు. ఈ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్‌ పరీక్ష పూర్తిచేసిన అభ్యర్థులకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో మళ్లీ డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు.

Read More : Door-To-Door Vaccination : బికనెర్‌లో ఇంటింటికి వ్యాక్సిన్.. దేశంలోనే ఫస్ట్ సిటీ..!