పెళ్లి ముహూర్తానికి గంట ముందు పెళ్లికూతురిని చంపిన పెళ్లికొడుకు
పెళ్లికి ఒక గంట ముందు చీర, డబ్బు కారణంగా వాగ్వాదం చెలరేగిందని పోలీసులు తెలిపారు.
Gujarat: మరో గంటలో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి వచ్చిన అతిథులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. ఇటువంటి సమయంలో కాబోయే భార్యను చంపాడు వరుడు. ఈ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
ప్రభుదాస్ సరస్సు సమీపంలోని టెక్రీ చౌక్ వద్ద పెళ్లి జరగాల్సి ఉంది. చీర, డబ్బు విషయం మీద పెళ్లికొడుకు, పెళ్లికూతురి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోని హిమ్మత్ రాథోడ్ అనే అమ్మాయితో సజన్ బరైయా అనే యువకుడు ఏడాదిన్నర నుంచి కలిసి ఉంటున్నాడు. వీరిద్దరికి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. శనివారం రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే పెళ్లికి ఒక గంట ముందు చీర, డబ్బు కారణంగా వాగ్వాదం చెలరేగిందని పోలీసులు తెలిపారు. ఆగ్రహంతో సజన్.. ఐరన్ పైప్‌తో సోనిని కొట్టాడు. ఆమె తలను గోడకేసి బాదాడు.
అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపారు. పెళ్లికూతురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
