చలి పంజా : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం

చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 02:37 AM IST
చలి పంజా : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం

Updated On : December 30, 2019 / 2:37 AM IST

చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు

చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ, చండీఘడ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.

కేంద్రపాలిత ప్రాంతాలు కశ్మీర్‌ లోయ, లఢక్‌ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో హర్యానా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సోమ, మంగళవారాల్లో(డిసెంబర్ 30, 31,2019) విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. గత 5 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. జమ్ముకశ్మీర్‌లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.

శ్రీనగర్‌లో శనివారం రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్‌ 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ద్రాస్‌ లో మైనస్‌ 28.7 డిగ్రీల సెల్సియస్‌, లఢక్‌లో మైనస్‌ 19 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి ప్రభావంతో కశ్మీర్‌లోని దాల్‌ సరస్సు ఆదివారం(డిసెంబర్ 29,2019) గడ్డకట్టింది. స్థానిక నీటి సరఫరా పైప్‌ లైన్లు గడ్డకట్టిపోయాయి. దట్టమైన పొగమంచుతో హర్యానా, ఢిల్లీలో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా ఢిల్లీలో అధికారులు రెడ్ అలర్ట్‌ ప్రకటించారు. స్కూళ్లకు రెండో రోజుల సెలవులు ప్రకటించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఢిల్లీ నగరాన్ని పొగ మంచు కప్పేసింది. ఉదయం 10 దాటినా మంచు తెరలు తొలగని పరిస్థితి. దీంతో వాహనరాకపోకలు, రైలు సర్వీసులకు అంతరాయం తప్పడం లేదు. విమాన సర్వీసులపైనా పొగ మంచు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. స్వెట్టర్లు ధరించి, మంటలను కాచుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు జనాలు.

డిసెంబర్ 14 నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతూ వస్తున్నాయి. ఇటీవలే 118 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఢిల్లీలో 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1901లో కూడా ఇదే విధంగా డిసెంబర్‌ నెలలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

* చలి గుప్పిట్లో ఉత్తర భారతం
* జమ్ముకశ్మీర్ లో -6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* పూర్తిగా గడ్డకట్టుకుపోయిన దాల్ సరస్సు
* లడఖ్ లో అసాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
* ద్రాస్ లో -28.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన హర్యానా ప్రభుత్వం