ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం

ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది.

ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం

Helicopter crashes

Updated On : June 15, 2025 / 10:10 AM IST

Helicopter crashes: చార్‌ధామ్ యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్‌, ఆరుగురు ప్రయాణికులు మొత్తం ఏడుగురు ఉన్నారు. వారిలో ఏడుగురు మృతి చెందారు.

రుద్రప్రయాగ్ జిల్లాలోని గుప్త్‌కాశి నుంచి కేదార్‌నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుప్త్‌కాశి నుంచి తెల్లవారుజామున 5.17 గంటలకు హెలికాప్టర్‌ ప్రయాణీకులను ఎక్కించుకొని కేదార్‌నాథ్‌కు బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ దారితప్పి కూలినట్లు తెలుస్తుంది. ఇది అర్యన్ ఏవియేషన్ కు సంబంధించిన హెలికాప్టర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లోని ఏడుగురు మరణించారు.
హెలికాప్టర్‌లోని ప్రయాణీకులు: రాజ్‌వీర్ (పైలట్), విక్రమ్ రావత్, వినోద్, తృష్టి సింగ్, రాజ్‌కుమా, శ్రద్ధ, రాశి(10 ఏళ్ల బాలిక).

సీఎం ధామి ట్వీట్..
హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి చాలా విచారకరమైన వార్తలు అందాయి. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయ, రెస్క్యూ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. ప్రయాణీకులందరి భద్రత కోసం నేను బాబా కేదార్ ను ప్రార్థిస్తున్నాను అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 5:20 గంటల ప్రాంతంలో గుప్త‌కాశీ నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ బయలుదేరింది. పైలట్ తోపాటు.. ఆరుగురు ప్రయాణికులు (ఐదుగురు పెద్దలు, ఒక పిల్లవాడు) ఉన్నారు. హెలికాప్టర్‌లోని ప్రయాణికులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందినవారు. సాంకేతిక సమస్య తలెత్తడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ బయల్దేరిన 10 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. ఘటన స్థలంకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని తెలిపింది.