Hindu Rashtra: హిందూ రాష్ట్రం ఏర్పడిందట.. యువతతో మోహన్ భాగవత్

ప్రపంచాన్ని అంధకారం నుంచి వెలుగులోకి భారత్ తీసుకెళ్లబోతోందని అన్నారు. ఈ రోజు భారతదేశం చాలా శక్తివంతమైందని, లిబియాకు వెళ్లడం ద్వారా ఇతర దేశాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తామని అన్నారు

Hindu Rashtra: హిందూ రాష్ట్రం ఏర్పడిందట.. యువతతో మోహన్ భాగవత్

రైట్ వింగ్ సంస్థలు తరుచూ హిందూ రాష్ట్రం గురించి మాట్లాడటం సాధారణమే. ఈ వరుసలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తన గొంతుకను చాలా బలంగా ఇస్తుంటుంది. ఇంతకీ అదెప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలనే విషయమై మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉన్నట్టుండి హిందూ రాష్ట్రం ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆదివారం (నవంబర్ 26) జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఇప్పటికే హిందూ దేశమని, మనం దానిని గుర్తించాలని అన్నారు.

దేశంలోని యువత గురించి భగవత్ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో యువత అద్భుతాలు చేస్తున్నారు. అయితే వారికి అవకాశాలు కల్పించే వారు అవసరం. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చింది. అయితే దీన్ని నియంత్రించే వ్యవస్థ లేదు. అందుకే ప్రజలు భయపడుతున్నారు. భారతదేశం పురోగతి కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. భారత్ సొంతంగా ఏదైనా చేసినప్పుడే దేశ ప్రగతి జరుగుతుంది. యోగా గురించి భగవత్ మాట్లాడుతూ నేడు ప్రపంచం మొత్తం యోగాను గుర్తిస్తోంది. పూర్వం దీనిని మంత్రవిద్య అని పిలిచేవారు. ఇప్పుడు దేశం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది భారతదేశపు పురోగతి’’ అని అన్నారు.

భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడం ఎలా?
హిందూ రాష్ట్రానికి సంబంధించి, RSS చీఫ్ మాట్లాడుతూ “హిందూ రాష్ట్రాన్ని సృష్టించడం ఏమిటి? అయితే అది ఇప్పటికే ఉంది. మీరు దానిని గుర్తించాలి. మనం మరింత ఎక్కువ మంది స్నేహితులను చేర్చుకోవాలి. భారత్-అమెరికా కలిసి పనిచేయాలి” అని అన్నారు.

ప్రపంచాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్లే దేశం భారత్
ప్రపంచాన్ని అంధకారం నుంచి వెలుగులోకి భారత్ తీసుకెళ్లబోతోందని అన్నారు. ఈ రోజు భారతదేశం చాలా శక్తివంతమైందని, లిబియాకు వెళ్లడం ద్వారా ఇతర దేశాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తామని అన్నారు. స్వాతంత్య్రం, సమానత్వం కలసి రావని రాజ్యాంగ పరిషత్‌లో డాక్టర్ అంబేద్కర్ చెప్పారని, ఈ రెండింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే సౌభ్రాతృత్వం అవసరమని, భారతదేశం మహోన్నతమని, మనమందరం సోదరులమని, అంటరానితనం పనిచేయదని అన్నారు. మన సమస్యలన్నింటికీ సుహృద్భావమే పరిష్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.