బీజేపీ నేతల హత్యకు కారణమైన హిజ్బుల్ కమాండర్ ఎన్ కౌంటర్ లో హతం

  • Published By: venkaiahnaidu ,Published On : November 1, 2020 / 06:33 PM IST
బీజేపీ నేతల హత్యకు కారణమైన హిజ్బుల్ కమాండర్ ఎన్ కౌంటర్ లో హతం

Updated On : November 1, 2020 / 7:00 PM IST

Hizbul Mujahideen operational chief killed రెండు రోజుల క్రితం శ్రీనగర్ లో ముగ్గురు బీజేపీ నాయకుల హత్యకు కారకుడైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్’సైఫుల్లా మిర్’ఆదివారం(నవంబర్-1,2020)భద్రతాదళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.



శ్రీనగర్ లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమచారంతో ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్ పోలీసు మరియు సీఆర్పీఎఫ్ టీమ్ సంయుక్తంగా ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదులు దాగినట్లు అనుమానించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. భద్రతాదళాలు వారి కాల్పులను ధీటుగా తిప్పికొట్టాయి. ఈ ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ ఆపరేషనల్ చీఫ్ ‘సైఫుల్లా మిర్’ ని భద్రతా దళాలు అంతమొందించాయి.



ఉగ్రవాదిగా అనుమానిస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎన్ కౌంటర్ స్పాట్ లో ఓ ఏకే రైఫిల్,ఓ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా,ఈ ఏడాది మే నెలలో “రియాజ్ నైకూ” ఎన్ కౌంటర్ లో చనిపోయిన తర్వాత సైఫుల్లా మిర్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బాధ్యతలు తీసుకొని ఉగ్రకార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో సైఫుల్లా మృతిచెందాడు.