HMPV Virus : భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. బెంగళూరులో తొలికేసు నమోదు!
బెంగళూరులో చిన్నారిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.

HMPV in India_ First case detected in Bengaluru
HMPV virus in India: చైనాలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ ఆందోళనకు గురిచేస్తున్న విషయం విధితమే. వేలాది మంది ప్రజలు ఈ వైరస్ బారినపడి అక్కడి ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ వైరస్ తో వచ్చిన కేసులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, తాజాగా భారత్ లోనూ హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు నమోదైనట్లు తెలిసింది. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాటివ్ లక్షణాలు ఉన్నట్లు సమాచారం.
బెంగళూరులో చిన్నారిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘‘రాష్ట్రంలోని ల్యాబ్ లో ఈ పరీక్ష నిర్వహించలేదు. ఆ రిపోర్టు ప్రైవేట్ ఆస్పత్రి నుంచి వచ్చింది. దానిపై తమకు ఎలాంటి అనుమానలు లేవు. అయితే, దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు’’ అని పేర్కొన్నారు. అయితే, చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ రం.. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో గుర్తించిన వైరస్ ఒకటేనా కాదా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.
హెచ్ఎంపీవీ అంటే..
హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. 2001లో దీనిని కనుగొన్నారు. ఈ వైరస్ అన్ని వయస్సుల వారికి సోకుతుంది. శిశువులు, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ అంటు వ్యాధి. ఈ వైరస్ లక్షణాలు ఉన్నవారు దగ్గు, తమ్ములతో ఇతరులకు త్వరగా వ్యాపిస్తుంది.
లక్షణాలు ఇలా..
♦ నిరంతరం సాధారణ జ్వరం ఉంటుంది.
♦ దగ్గు ఉంటుంది. అది ఒక్కోసారి తీవ్రంగా మారొచ్చు.
♦ ముక్కు దిబ్బడగా అనిపించడంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
♦ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంది.
♦ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది.
♦ చిన్న పిల్లలకు శ్వాస సమస్యల కారణంగా తల్లిపాలు, సీసాలో పాలు పట్టించడం ఇబ్బంది అవుతుంది.
వైరస్ వ్యాప్తి ఇలా..
♦ దగ్గు, తమ్ము వల్ల వెలువడే తుంపర్లు ద్వారా ఇతరులకు ఈ వైరస్ సోకుతుంది.
♦ వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, తాకడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
♦ వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తరువాత నోరు, ముక్కు, కళ్లను తాకితే వైరస్ సోకే అవకాశం ఉంది.