Supreme Court : ఆస్పత్రులు రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లా మారిపోయాయ్

మౌలిక వసతులు సరిగా లేని కొవిడ్​ హాస్పిటల్స్ పై సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది .

Supreme Court :  ఆస్పత్రులు రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లా మారిపోయాయ్

Supreme Court

Updated On : July 19, 2021 / 9:58 PM IST

Supreme Court  మౌలిక వసతులు సరిగా లేని కొవిడ్​ హాస్పిటల్స్ పై సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయాల్సిన హాస్పిటల్స్.. రియల్ ఎస్టేట్​ పరిశ్రమల్లా మారాయని జస్టిస్​ డి.వై. చంద్రచూడ్​, జస్టిస్​ ఎం.ఆర్.​ షాల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హాస్పిటల్స్ బాధలో ఉన్న రోగులకు సహాయాన్ని అందించడానికి ఉద్దేశించినవని.. కానీ అవి డబ్బు సంపాదించే యంత్రాలుగా మారాయని పేర్కొంది. అగ్ని మరియు భవన భద్రతా నిబంధనలపై తక్కువ శ్రద్ధ చూపుతున్న రెసిడెన్షియల్ కాలనీలలో 2-3 గదుల ఫ్లాట్ల నుండి నడుస్తున్న నర్సింగ్ హోమ్స్ ని వెంటనే మూసివేయాలని కోర్టు ఆదేశించింది. అత్యవసర మౌలిక సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది.

ఇక, చట్టాల ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు హాస్పిటల్స్ కు వచ్చే ఏడాది జులై వరకు హాస్పిటల్స్ కు గడువును పొడిగిస్తూ.. గుజరాత్​ ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది గతేడాది డిసెంబర్ 18న ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది. 2022 జులై వరకు ఆస్పత్రులు తమ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. ఆ నోటిఫికేషన్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అగ్నిమాపక భద్రతా ఆడిట్​, నోటిఫికేషన్​ వివరాలపై సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఆ రాష్ట్రానికి స్పష్టం చేసింది.

కాగా, కొవిడ్​ హాస్పిటల్స్ ని నెలకోసారి తనిఖీలు చేయాలని గతేడాది డిసెంబర్​ 18న అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అగ్నిప్రమాద ఘటనలు జరగడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని నాసిక్​లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో రోగులు, వైద్య సిబ్బంది మరణించిన ఘటనను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. కాగా, కోవిడ్ పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ పై సుమోటోగా విచారిస్తున్న ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.