కరోనా ఫైట్ లో…పొరుగు దేశాలకు భారత సాయం ఇదే

చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే చైనాలో 500మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు చైనాలో 1100మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అయితే భయంకరమైన ఈ వైరస్ ను ఎదుర్కోవడంలో చైనాతో సహా,ఆగ్నేయ ఆసియాలోని దేశాలకు భారత్ అండగా ఉంటుందని ఇటీవల భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భారత్ లో కూడా మూడు కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురూ కరోనా మొదటగా వెలుగులోకి వచ్చిన వౌహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చినవారే.
విదేశాల క్లినికల్ శాంపిల్స్ ను మన దేశంలోని లేబరేటరీల్లో టెస్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్ పార్లమెంట్ కు తెలిపారు. ఆగ్నేయ ఆసియాలోని దేశాలకు…శాంపిల్స్ ను టెస్ట్ చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)అంగీకరించిందని హర్షవర్థన్ తెలిపారు. ఇప్పటికే మాల్దీవులు నుంచి పంపిన శాంపిల్స్ ను టెస్ట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా వైరస్ ను డీల్ చేయడంలో,ప్యాసింజర్లను స్క్రీన్ చేయడంలో భూటాన్ కు టెక్నికల్ సాయం అందించేందుకు కూడా అంగీకరించినట్లు తెలిపారు.
హై రిస్క్ వ్యాధులను టెస్ట్ చేయడంలో భారత్ లో పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మంచి పేరు పొందిన లేబరేటరీ. ఈ ఇనిస్టిట్యూట్ కు యూస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి అరుదైన బయలాజికల్ సేఫ్టీ లెవల్-4(BSL-4)సర్టిఫికేషన్ ఉంది. భయంకరమైన వ్యాధులపై వర్క్ చేసే ఇనిస్టిట్యూట్ లకు ఇది సర్టిఫికెట్ ఇస్తుంది. భారత్ లోని మరో 10 ఇతర లేబరేటరీల్లో కూడా శాంపిల్స్ ను టెస్ట్ చేస్తున్నట్లు హర్షవర్థన్ తెలిపారు. ఇప్పటివరకు పూణే ఇనిస్టిట్యూట్ చైనాకు ప్రయాణించి తిరిగొచ్చిన 242మంది శాంపిల్స్ ను టెస్ట్ చేసింది.
వైరస్ ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి కూడా భారత్ సహాయం అందిస్తోంది. చైనాలోని వూహాన్‌లో చదువుతున్న పాకిస్థాన్‌తో సహా అన్ని పొరుగు దేశాల నుంచి విద్యార్థులను తరలించడానికి భారత్ ముందుకొచ్చిందని ఫిబ్రవరి 7 న విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పార్లమెంటుకు తెలియజేశారు. ఇది మా పొరుగువారందరికీ చేసిన ఆఫర్, కాని మాల్దీవుల ఏడుగురు పౌరులు మాత్రమే ఈ ఆఫర్ పొందటానికి ఎంచుకున్నారు అని జైశంకర్ చెప్పారు. చైనా నుంచి మనదేశానికి చెందిన 600మందిని ఫిబ్రవరి-1,2న ఎయిర్ ఇండియా విమానంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
సోమవారం, ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్…. భారతదేశం సంఘీభావం, సహాయం అందించినందుకు ప్రశంసించారు. న్యూఢిల్లీ మరియు బీజింగ్ మధ్య స్నేహాన్ని ఈ ప్రయత్నాలు పూర్తిగా ప్రదర్శించాయని జిన్ పింగ్ చెప్పారు. ఫిబ్రవరి 2 న, మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ కూడా ఏడుగురు మాల్దీవుల పౌరులను చైనా నుండి బయటకు రావడానికి సహాయం చేసినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.