కథ అడ్డం తిరిగింది : సుప్రీం తీర్పుతో బీజేపీ గేమ్ ప్లాన్ రివర్స్!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వేసిన ఎత్తులకు సుప్రీంకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. సంకీర్ణ ప్రభుత్వం ఎత్తులను చిత్తు చేసిన బీజేపీకి ఆఖరి క్షణాల్లో చేతులేత్తేయక తప్పలేదు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన 80 గంటల్లోనే అనూహ్య పరిణామాలతో రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.
బీజేపీ పెద్దల ఆదేశాలతో ఫడ్నవీస్ రాజీనామా చేస్తున్నట్టు మీడియా ఎదుట సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బలపరీక్షలో బహిరంగ బ్యాలెట్ ద్వారా నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే ఇందుకు కారణమని రాజకీయ వర్గాల సమాచారం. మూడు పార్టీలైన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ అజిత్ పవార్ రాజీనామా చేశారు.
అసెంబ్లీ విశ్వాస ఓటు పొందడానికి కోర్టు ఫడ్నవీస్ ప్రభుత్వానికి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఇచ్చింది. అంతేకాదు.. అసెంబ్లీలో జరిగే బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రో-టెమ్ స్పీకర్ నిర్వహించే బహిరంగ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోర్టు నిర్దేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తొలుత బీజేపీ విశ్వాసంతో ఉంది. సభలో తమ పార్టీ మెజారిటీని నిరూపించుకుంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలతో ముందస్తు బలపరీక్షకు పార్టీ సిద్ధంగానే ఉంది. కానీ, తరువాత వచ్చిన అనివార్య పరిస్థితులతో అంతా తిరగబడిందన్నారు.
ఎన్‌సిపి శాసన పార్టీ నేతగా అజిత్ పవార్ హోదా, దాని స్పీకర్‌ను రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవడం అనే రెండు విషయాలపై బీజేపీ నేతలు ఆధారపడుతున్నారని ఆయన అన్నారు. శాసనసభ స్పీకర్ ఎన్నికైన తరువాత విశ్వాస పరీక్ష సాధారణంగా నిర్వహించబడుతుంది.
ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే, మహారాష్ట్ర శాసనసభ నిబంధనల ప్రకారం స్పీకర్ ఎన్నిక, అది రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం తన మెజారిటీని ఎలా రుజువు చేస్తుందో స్పీకర్ నిర్ణయించగలరు. 2014లో బీజేపీ కూడా అసెంబ్లీలో బలపరీక్షలో వాయిస్ ఓటు తర్వాత స్పీకర్ ను ఎన్నుకోవడం జరిగింది.